Heavy Rains in Andhra Pradesh State wide : అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. అత్యవసర సాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు. బుధవారం నాడు శ్రీకాకుళం, విజయనగం, పార్వతీపురం మన్యం, ఏలూరు, శ్రీ సత్యసాయిజిల్లా తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 44 పాయింట్ 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పశ్చిమ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరుతో పాటు మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో కొండ వాగులు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ప్రవహిస్తోంది. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలో కొలువుతీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గమధ్యంలో వాగులు పొంగుతున్న నేపథ్యంలో ఆలయ దర్శనాన్ని కమిటీ సభ్యులు నిలిపివేశారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీలు ఆక్రమణకు గురవ్వడంతో నివాసాల వద్ద మురుగునీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా గోదావరి నదిలో చేరిన లక్ష క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేశారు. దీంతో గౌతమి గోదావరి నదిపాయకు ఆనుకుని ఉన్న లంక గ్రామాలకు వరద తాకిడి ఎక్కువవుతోంది. ముమ్మిడివరం పరిధిలోని పశువులంక. పల్లంవారిపాలెం, గురజాపులంక గ్రామాల భూములు కోతకు గురవుతున్నాయి. నది పాయకు ఆనుకొని నివసిస్తున్న ప్రజలు ఇళ్ల రక్షణ గోడలు వరదకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి రక్షించుకుంటున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ వద్ద క్రమేపి నీటిమట్టం పెరుగుతూ వస్తోంది.ప్రాజెక్ట్ స్పిల్ ఎగువ నీటిమట్టం 28.080 మీటర్లు కాగా, స్పిల్‌వే దిగువ నీటిమట్టం 18.230 మీటర్లు కు చేరింది. అదేవిధంగా ఎగువ కాపర్ డాం నీటిమట్టం 28.230 మీటర్లు, దిగువ కాపర్ డ్యాం నీటిమట్టం 17.570 మీటర్లకు చేరింది. వరద నేపథ్యంలో రెండు లక్షల క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వర్షాలు నేపథ్యంలో గోదావరిఖని కారణంగా పాపికొండలు విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు.
వాతావరణ శాఖ హెచ్చరిక - రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు - Heavy Rain Alert in AP
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండల సమీపంలో గండి పోచమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. అమ్మవారి విగ్రహాన్ని నడుము వరకు గోదావరి నీరు తాకింది. భక్తుల క్యూ లైన్లు, బయట దుకాణ సముదాయాలు నీటిలో ములుగుతున్నాయి. ఆలయ అధికారులు దర్శనాలు నిలిపివేశారు. పాపికొండలు విహార యాత్రకు వెళ్లే లాంచీలను తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరి పెరుగుతుంది నది పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కృష్ణాజిల్లా, కోడూరు మండలం, మాచవరం గ్రామంలో రాత్రి వీచిన గాలులు వర్షానికి పశువుల చావిడి కూలిపోవడం వలన ముళ్ళపూడి వెంకటేశ్వరరావు ఎద్దు మృతి చెందింది. రాత్రి సమయం కావటంతో ఎవరూ చూడపోవటంతో ఎద్దు మృతి చెందింది. చావడిలో ఉన్న మరొక ఎద్దు కొద్దిపాటి గాయాలతో మృత్యువు నుంచి బయటపడింది. గత నాలుగు నెలల క్రితం ఒక్కో ఎద్దును లక్షా ఇరవై వేలకు కొనుగోలు చేసానని రైతు తెలిపారు. తన ఇంటికి పశువుల చావిడి దూరంగా ఉండటం వలన వాటిని కాపాడ లేకపోయానని రైతు ఆవేదనం చెందాడు. ఎద్దుకు ఇన్సూరెన్స్ ఇప్పించి తనను ఆదుకోవాలని కోరుతున్నారు.
విజయవాడలో వర్షంతో ప్రజలు అవస్థలు - కాలువలను తలపిస్తున్న కాలనీలు - PEOPLE SUFFER WITH HEAVY RAIN