Sri Sri Ravi Shankar On Canada Temple Attack : కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. భిన్న సంస్కృతులకు నెలవైనటువంటి కెనడా లాంటి దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. హిందూ దేవాలయంపై దాడులకు పాల్పడిన వారు కోట్లాది మంది హిందువుల మనోభావాలతో పాటు సిక్కు మతాన్ని, సిక్కు గురువులను కూడా అవమానిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆలయంపై దాడి అవివేక చర్య : ఆలయాల రక్షణకు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు మతానికి 10 మంది గురువులు తమ జీవితాలనే త్యాగం చేశారన్నారు శ్రీశ్రీ రవిశంకర్. అలాంటి మహనీయుల త్యాగాలను కొందరు వ్యక్తులు చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కెనడాలో హిందువుల ఆలయంపై దాడి ఘటన అవివేక చర్య అని, అది సిక్కులకు వారి గురువులకు కూడా అవమానకరమని శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. ఘటనకు పాల్పడినవారు హిందువులనే కాకుండా సిక్కులనూ అవమానపరిచారని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు.
"ఆలయంపై దాడి జరగడం దురదృష్టకర ఘటన. ఇటువంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. శాంతికి నిలయమైన కెనడాలో ఇలాంటివి రిపీట్ కాకూడదు. అక్కడ అన్ని సంస్కృతులకు చెందిన ప్రజలు ఎన్నో ఏళ్లుగా జీవనంసాగిస్తున్నారు. ఆలయంపై దాడి చేసిన వారు దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందే. దేవాలయాల రక్షణకు, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు మతానికి చెందిన 10 మంది గురువులు తమ జీవితాలనే త్యాగం చేశారు. అలాంటి వారి త్యాగాలను కొంతమంది చిన్నచూపు చూస్తున్నారు" అని శ్రీశ్రీ రవిశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు.