Spurious Seeds in Telangana : ప్రపంచంలో అత్యంత కష్టతరమైన వృత్తుల పేర్లు చెప్పమంటే అందులో అగ్రభాగంలో ఉండేది వ్యవసాయం. కారణం ప్రతి దశలోనూ సవాళ్లు పలకరించడమే. వర్షాలు సరిగా కురవడం నుంచి మొదలు పండిన పంటకు గిట్టుబాటు ధర రావడం వరకు అడుగడుగునా కష్టాలే. ఇన్ని ఇబ్బందులు చాలవు అన్నట్లు తెలంగాణలో నకిలీ విత్తన వ్యాపారులు రైతులను మరిన్ని కష్టాలపాలు చేస్తున్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో కూడా నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి వదిలేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీ విత్తన వ్యాపారుల ఆగడాలను అడ్డుకునేందుకు విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు చేసేందుకు యోచిస్తోంది.
Telangana Govt focus on Counterfeit Seeds : నకిలీ విత్తనాల (Fake Seeds) వల్ల రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాటితే మొలకెత్తవు. మొలకెత్తినా పైరు ఎదగదు. ఎదిగినా బలంగా ఉండదు. త్వరగా చచ్చిపోతుంది. నిలిచినా చీడపీడలకు తట్టుకోలేదు. విత్తనాలు నాటిన తర్వాత మొలకెత్తిందీ లేనిదీ పది రోజులకు గాని తెలియదు. విత్తనాలు నకిలీవి అని తెలియవు. ఆ తర్వాత చూస్తే ఫలితం షరామామూలే. రాష్ట్రంలో నకిలీ విత్తనాల వల్ల మోసపోయిన పలువురు అన్నదాతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
Fake Cotton Seeds In Telangana : తెలంగాణ రైతుపై "నకిలీ విత్తనం" పడగ
నకిలీ విత్తనాల కోసం మోసగాళ్లు ప్రధానంగా పత్తి (Fake Cotton Seeds), మిరప, మొక్కజొన్న వంటి వాటినే ఎంచుకుంటున్నారు. ఈ విత్తనాలకే వేలల్లో ధర ఉండడంతో అక్రమార్కులు వీటిని యథేచ్ఛగా విక్రయించి లక్షల్లో సంపాదిస్తుంటారు. జిన్నింగ్ మిల్లుల నుంచి తెచ్చిన పత్తి గింజలు, మార్కెట్‌లో కొన్ని మక్కలను, పొడి పరిశ్రమ నుంచి తెచ్చిన మిరప గింజలు, ఇతరత్రా సాధారణ పద్ధతుల్లో సేకరించిన కూరగాయల గింజలకు విత్తన శుద్ధి మందును పట్టించి అందమైన కవర్లు, డబ్బాల్లో నింపి ప్రముఖ కంపెనీల పేరిట లేదా నూతన విత్తనాలు అని ప్రతి పంటకు రైతులకు అంటగడతున్నారు. ఇవి రైతులకు చేరి దిగుబడి రాక నష్టపోతున్నారు.
ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి : నకిలీ విత్తనాల విషయంలో రైతులు అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొని బిల్లులు తీసుకోవాలి. గ్రామాల్లో జీరో కింద ఎలాంటివి కొనుగోలు చేయరాదు. విత్తనాల బస్తాపై గాని, ప్యాకెట్లపై గాని విత్తన వివరాలు లేబుల్ రూపంలో లేకుంటే అవి నకిలీవి అని గుర్తించాలి. నకిలీ విత్తనాల ప్యాకెట్‌పై లాట్ నంబరు ఉండదు. నకిలీ విత్తనాలు అని అనుమానం వస్తే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలి.
నిబంధనలు పాటించని డీలర్లు : విత్తనాల విక్రయాల విషయంలో డీలర్లు పలు నిబంధనలు పాటించాలని చట్టం చెబుతోంది. విత్తన నియంత్రణ చట్టం 1983లోని సీడ్ యాక్ట్ 1966 ప్రకారం డీలర్లు సర్కార్ జారీ చేసిన లైసెన్సులను కలిగి ఉండాలి. ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలి. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలి. బిల్లులను కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. అయితే రాష్ట్రంలో అనేక మంది డీలర్లు ఈ నిబంధనలను పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
Fake Seeds in Telangana : డీలర్లే కాకుండా కొందరు వ్యాపారులు, దళారులు నకిలీ విత్తన విక్రయాలనే వృత్తిగా చేసుకుని రైతులను ముంచుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయ, మార్కెటింగ్, పోలీసు అధికారుల కనుసన్నల్లోనే విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మామూళ్లకు అలవాటు పడి వీరు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ చట్టం ప్రయోగిస్తామని గతంలో ప్రభుత్వం హెచ్చరించినా ఆగడాలకు అడ్డు పడటం లేదు.
లైసెన్సింగ్ విధానం సరిగా లేదనే విమర్శలు : రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న లైసెన్సింగ్ విధానం సరిగా లేదని, పారదర్శకత లోపించిందనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. చట్టాలు కఠినంగా లేకపోవడం వల్ల లైసెన్సులు లేని వ్యాపారులు కూడా అడ్డూ అదుపు లేకుండా తమ దందా కొనసాగిస్తున్నారు. మరి లైసెన్సింగ్ విధానంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో అది ఏ రూపంలో ఉంటుంది అనే చర్చ మొదలైంది.
అయితే కొత్త విధానంలో లైసెన్సులను పారదర్శకంగా కేటాయించాలని, నకిలీ విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలను పొందుపర్చాలని రైతులు, వ్యవసాయ నిపుణులు కోరుతున్నారు. విక్రయాలు జరిపే వారితో పాటు, తయారీదారులు, నకిలీ విత్తన వ్యాపారులకు సహకరిస్తున్న వ్యవసాయ, మార్కెటింగ్, పోలీసు అధికారులపైనా చర్యలు ఉండాలని హితవు పలుకుతున్నారు. అప్పుడే నకిలీ విత్తన వ్యాపారులకు అడ్డుకట్టపడి అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి : మంత్రి తుమ్మల