Mahabubnagar Palamuru University Hostel Issues : ఆరుగురు ఉండాల్సిన గదుల్లో 10 నుంచి 12 మంది సర్దుకుపోతున్నారు. గదులైనా సరిగ్గా ఉన్నాయా అంటే, కొన్నింటికి తలుపులు లేవు. మరి కొన్నింటికి కిటికీలు లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆహారంలో నాణ్యత లేదు. తాగునీళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకటి కాదు, రెండు కాదు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు లెక్కే లేదు. పాలమూరు విశ్వవిద్యాలయ వసతి గృహాల దుస్థితిపై కథనం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు విద్యాప్రదాయని పాలమూరు విశ్వవిద్యాలయం. ఉమ్మడి జిల్లా సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. యూనివర్శిటీలో 54 గదులతో జూనియర్ బాలికల వసతి గృహం, 55 గదులతో పీజీ వసతి గృహం, 39 గదులతో పీజీ బాయ్స్ హాస్టల్, 39 గదులతో ఫార్మసీ హాస్టల్ అందుబాటులో ఉన్నాయి.
బాలికల కోసం ప్రత్యేకంగా మరో భవనాన్ని వసతి గృహంగా వినియోగిస్తున్నారు. పీయూలోని హాస్టళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గదుల కొరత వేధిస్తోంది. కిటికీలు పగిలి, తలుపులు విరిగి దర్శనమిస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరుగుదొడ్లకు, మూత్రశాలలకు తలుపులు లేకపోవడం.. వాటిని శుభ్రం చేయకపోవడం వంటి సమస్యలతో, విద్యార్థులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
రోడ్డుపై బైఠాయించిన నిజాం కళాశాల విద్యార్థినులు - వసతి గృహంలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్
పాలమూరు యూనివర్శిటీ వసతి గృహాల్లో, అమ్మాయిల సమస్యలు వర్ణణాతీతం. 320 మంది ఉండాల్సిన వసతిగృహంలో 700 వరకూ ఉంటున్నారు. గతంలో కస్తూరిబా పాఠశాల నడిచిన 12 గదుల భవనాన్ని కూడా ప్రస్తుతం లేడీస్ హాస్టల్ కోసం ఉపయోగిస్తున్నా సరిపోవడం లేదు. ఒక్కో గదిలో 10 నుంచి 12 మంది సర్దుకుంటున్నారు. తాగునీరు, భోజనం , మరుగుదొడ్లు, వసతి సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానానికి గురైతే పట్టించుకునే దిక్కులేదని వాపోతున్నారు.
వసతి గృహాల్లో భోజనం బాగాలేదని, తినే ఆహారం కంటే చెత్తబుట్టలో పడే ఆహారమే ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ, ఫార్మసీ వసతి గృహాలకు సంబంధించిన వంటగది ఆరుబయటే ఉండటంతో, అపరిశుభ్రతకు అవాసంగా మారింది. వాటర్ ప్లాంట్ పాడై, ఏడాది గడిచినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఏటా విశ్వవిద్యాలయంలో చదివేవారి సంఖ్య పెరుగుతోందని, అందుకు అనుగుణంగా వసతిగృహాల సామర్థ్యం పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.
'యూనివర్సిటీ హాస్టళ్లు సరైన వసతులు లేవు. గత కొద్ది కాలంగా అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఒక్క గదిలో సుమారు 10 మందికి పైగా ఉంటున్నాం. తినే అన్నం కన్నా, చెత్తబుట్టలో పడేసే అన్నం ఎక్కవగా ఉంది. హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన అధ్వాన్నంగా తయారైంది. అమ్మాయిలకు సమస్యలు వచ్చి ఆసుపత్రికి పోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, అందుకు తగ్గట్టుగా వసతుల కల్పన జరగడం లేదు.'- పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు
ఫుడ్ బాగాలేదంటూ మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా - Malla Reddy University Students Protest