Special Story On Chess Player Divya Deshmukh : చదరంగం బోర్డుపై పావులు కదపడం ప్రారంభించిన ఏడాదికే జాతీయ పతకం సాధించింది ఈ అమ్మాయి. మరుసటి ఏడాది ఆసియన్ స్కూల్ ఛాంపియన్‌షిప్. అందుకే ఈమెను చిచ్చరపిడుగు అనేవారంతా. అలాంటి దివ్యా దేశ్‌ముఖ్ అనుకోకుండా చెస్‌లోకి అడుగుపెట్టిందంటే ఆశ్చర్యమే కదూ. ఈమెది మహారాష్ట్రలోని నాగ్‌పుర్. తండ్రి జితేంద్ర దేశ్‌ముఖ్ గైనకాలజిస్ట్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్. అమ్మ నమ్రత గైనకాలజిస్ట్.
ఆకర్షించిన చెస్ గడులు : దివ్యకి ఐదేళ్లు ఉన్నప్పుడు, అక్కేమో టెన్నిస్ సాధనకు వెళ్లేది. ఈమెనీ కూడా ఏదైనా స్పోర్ట్‌లో చేర్పించి ప్రోత్సహించాలనుకున్నారు. అక్కాచెల్లి ఇద్దరు ఒకేచోట సాధన చేస్తారని టెన్నిస్‌కి పంపారు. చిన్నపిల్ల టెన్నిస్ రాకెట్ మోసేంత బలం చేతుల్లో ఉంటుందా! నెట్‌ను దాటి బంతిని కొట్టడమూ చాలా కష్టమయ్యేది. దాంతో ఏమీ చేయలేక దాన్ని పక్కన పెట్టేసింది. వాళ్ల నాన్నేమో ఏమాత్రం సమయం దొరికినా చెస్‌బోర్డు ముందు పెట్టుకొని కూర్చునేవారు. ఆ తెలుపు, నలుపు గడులు చిన్నారి దివ్యని ఆకర్షించాయి. వాటినే తదేకంగా చూస్తోంటే పావులు కదపడమెలాగో దివ్యకు నేర్పించారు వాళ్ల నాన్న. అలా తన చెస్ ప్రయాణం మొదలుపెట్టింది దివ్య.
నాన్నతో గడపటం ఆనందమే కానీ తరచూ ఈ చెస్ అంటే తొలినాళ్లలో దివ్యకి కోపమొచ్చేదట. అయిదేళ్ల ప్రాయం, హాయిగా ఆడుతూ పాడుతూ గడిపే సమయంసో గంటలకొద్దీ కూర్చోవడం, బుర్రకు పనిచెప్పడమంటే ఏ చిన్నారికైనా ఏమాత్రం ఇష్టముంటుంది? దీనికితోడు స్కూల్లో నిద్రొచ్చేది. స్నేహితులంతా నవ్వుతోంటే చిన్న చూపుగా అనిపించేది. కానీ అమ్మానాన్నలు అవన్నీ చిన్నవే అని సర్దిచెప్పేవారు. తర్వాత నాన్నపై గెలుస్తోంటే అదామెకు ఎంతో ఆనందాన్నిచ్చేది. దాంతో తనకి ప్రొఫెషనల్ సాయం అవసరమని భావించిన తండ్రి శిక్షకుడిని ఏర్పాటుచేశారు. కోచ్ శిక్షణలో మరింత రాటుదేలింది దివ్య.
చరిత్ర సృష్టించిన దివ్య : అండర్-7 అమ్మాయిల విభాగంలో జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించింది. అండర్-9 కేటగిరీలో నేషనల్ ఛాంపియన్ గెలిచింది. అండర్-10 వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 12 సంవత్సరాలకే ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించింది. ఆసియన్ ఛాంపియన్‌షిప్, వరల్డ్ యూత్ చెస్ టోర్నమెంట్, ఇండియా విమెన్స్ ఛాంపియన్‌షిప్, ఆసియా విమెన్స్ టైటిల్ ఇలా చెప్పుకొంటూ పోతే లిస్టు పెద్దదే. ఇటీవలే వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచి, చరిత్ర సృష్టించింది.
ఇంకా ముందుకెళ్లాలనే భావనే : ఊహ తెలిసినప్పట్నుంచీ దివ్యకి చెస్సే లోకం. స్కూలుకెళ్లింది తక్కువే. పరీక్షలప్పుడు మాత్రం బ్రేక్ తీసుకుని పరీక్షలను చదివేది. ఇటీవల పోటీలకు ముందూ పన్నెండో తరగతి పరీక్షలూ అలాగే రాసింది. ఎప్పుడూ ‘నేనేదో సాధించా అని అనుకోదట. ఇంకా ముందుకెళ్లాలి’ అనే భావనలోనే ఉంటుందట దివ్య. అయితే ఫ్యాషన్‌కి మాత్రం ప్రాధాన్యమిస్తుంది. జుట్టును వదిలేయడమంటే ఇష్టమట కానీ వాటికి చాలా కామెంట్లు ఎదుర్కొంది.
"నా వరకూ నేను వంద శాతం ఇవ్వాలనే చూస్తా. కాబట్టే ప్రతి ఆటపట్లా గర్వంగా ఉంటా. కానీ కొంతమంది మాత్రం నేను ఆడే ఆటమీద కాకుండా నా దుస్తులు, జుట్టు, భాష వంటి అనవసర విషయాలపై దృష్టిపెడుతున్నారు. అమ్మాయిల ఆటతీరును, వాళ్ల బలాలను చూడండి." అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది" -దివ్యా దేశ్‌ముఖ్
తన డ్రెస్సులు, హెయిర్ స్టైల్ గురించి ఇతరులు చేసే కామెంట్లను పట్టించుకోవడం మానేసినట్లు దివ్య చెబుతోంది. వాటి గురించే ఆలోచిస్తే ఆటకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపింది. సీనియర్లు కూడా తన నిర్ణయానికి సహకరించారని చెప్పుకొచ్చింది. ఆటతోనే కాదు ధైర్యంతోనూ ముందుకు సాగుతోన్న దివ్య ఈ తరానికి స్ఫూర్తే.