Pooja on Nagula Chavithi in Karthika Masam 2024 : ఆది దేవుడు శివునికి ఇష్టమైన కార్తిక మాసం శుద్ధ పాడ్యమి ఈ నెల 2న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని శివాలయాలు భక్తుల సందడితో శోభాయమానంగా మారాయి. కార్తిక మాసం వేళ నెల రోజులపాటు నిష్ఠతో ప్రాతఃకాల అభిషేకాలు దీపారాధనలు చేస్తే అత్యంత ఫలప్రదం. సంధ్యా సమయంలో దీపారాధనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, గ్రహ దోషలు సైతం తొలగిపోయి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని భక్తుల నమ్మకం. నెల రోజులపాటు శివాలయాల్లో పరమశివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. కార్తిక మాసం మహోత్సవాల్లో భాగంగా నేడు నాగుల చవితి పండుగ జరగనుంది.
ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. ఈ నెల 15న కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని శివాలయాల్లో అత్యంత వైభవంగా వేడకలు నిర్వహిస్తారు. ఇప్పటికే తెల్లవారుజామునే మహిళా భక్తులు శివాలయాలకు చేరుకొని కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దేవాలయాల్లో దీపాలంకరణలు, జ్వాలా తోరణంలో పాల్గొంటే మానవాళికి సుఖసంతోషాలు కలుగుతాయని అర్చకులు అంటున్నారు. ఈ నెల 2న సాయంత్రం ఆకాశ దీపం ప్రజ్వలనతో కార్తిక మాసం శుద్ధ పాడ్యమి ప్రారంభం కాగా డిసెంబర్ 2న మార్గశిర శుద్ధ పాడ్యమి రోజుతో కార్తిక మాసోత్సవాలు ముగుస్తాయి.
ఈ నెల 15న కార్తిక పౌర్ణమి : కార్తిక మాసోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో ప్రముఖ శైవక్షేత్రమైన నీలాద్రీశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న సాయంత్రం ఆకాశదీపం వెలిగించి పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆలయ ఈవో పాకాల వెంకటరమణ చెప్పారు. ఈ నెల 2న ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, కుంకుమార్చనతో వేడుకలు జరిగాయని వివరించారు. రోజూ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, దశశాంతులు, బిల్వాష్టోత్రం, సత్యనారాయణస్వామి వ్రతాలు ఉంటాయని తెలిపారు.
ఈ నెల 12న ఏకాదశి అన్నాభిషేకం, ఈ నెల 15న కార్తిక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, అభిషేకాలు, 19న విభూది అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 29న మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 11 గంటలకు శివపార్వతుల కల్యాణం ఉంటుందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్నపురెడ్డిపల్లిలోని శ్రీభ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో కార్తిక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమ, శుక్రవారాల్లో ఈ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. తెలవారుజాము నుంచే మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి దీపాలు వెలిగిస్తారు.
ఆలయాల్లో కార్యక్రమాలు ఇలా : కార్తికమాసం వేళ నెలరోజుల పాటు ఆలయాల్లో స్వామివారికి నిత్యాభిషేకాలు, ఏకాదశి పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ఈనెల 2న విఘ్నేశ్వరపూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆకాశ దీపారాధనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 5న నాగులచవితి సందర్భంగా ఆలయాల్లోని పుట్ట వద్ద మహిళలు భారీ సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు.
12న అన్నాభిషేకం నిర్వహించగా 15న కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని, కృత్తికాదీపోత్సవం, కోనేటి హారతి, జ్వాలా తోరణం గంగా హారతి అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 19న లక్షబిల్వార్చన, 28న నందీశ్వరుని అభిషేకం, 29న శివపార్వతుల కల్యాణ మహోత్సవం జరగునుంది. ఇప్పటికే భక్తులు ఆలయాలకు అధికసంఖ్యలో వస్తున్న తరుణంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
కుజ, కాలసర్ప దోషాలను పోగొట్టే 'నాగుల చవితి'- పూజలో ఈ తప్పులు చేయొద్దు!
నాగుల చవితి పర్వదినం - ఈ విధంగా పూజ చేస్తే రాహుకేత దోషాలన్నీ తొలగిపోతాయట!