World Vision Day 2024 : నయనం ప్రధానం.. అంటే అన్ని అవయవాల్లోకి నేత్రాలు అత్యంత ప్రధానమైనవి అని అర్థం. చిన్న వయసులోనే చాలామందికి దృష్టి లోపం బాధిస్తోంది. కంటి చూపు మందగించి వారి జీవన ప్రయాణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా మన్యంలో చిన్నారుల కంటి పరిస్థితులపై ప్రత్యేక కథనం.
మన్యం జిల్లాలోని వైద్యశాలలు, అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ ఏడాది వివిధ కంటి రుగ్మతలతో బాధపడుతున్న 7,085 మందికి పరీక్షలు చేసి అందులో 3,060 మందికి ఆపరేషన్లు, 480 మందికి చికిత్స చేశారు. ప్రధానంగా అంతర కుసుమాలు, టేరిజియం, నీటి కాసుల కేసులు ఎక్కువగా వస్తున్నాయని కంటి వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఎక్కువగా 40 ఏళ్ల వయస్సు పైబడిన వారిలో కంటి చూపు మందగిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బడి ఈడు, బడిలో చదువుతున్న పిల్లలకు కంటి చూపు పరీక్షలు చేస్తున్నారు. అలాంటి వారు దాదాపు 1.20 లక్షల మంది వరకు ఉండగా ఇప్పటి వరకు 50 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 1,100 మందికి దృష్టి లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరికి ప్రభుత్వం కంటి అద్దాలు అందించనుంది. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా చేయనున్నారు.
కంటి పరీక్షలు చేస్తున్న వైద్య నిపుణులు
మన్యం జిల్లాలో ఎక్కువగా గ్లకోమా కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమేపీ చూపు మందగిస్తుంది. సకాలంలో దీన్ని గుర్తించకపోతే శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వంశ పారంపర్యంగా, మధుమేహం, రక్తపోటు ఉన్నవారికి, దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ వాడేవారికి, ప్రమాదాల్లో కంటికి గాయాలైనప్పుడు గ్లకోమా వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు తెలిపారు.
కారణాలు అనేకం..
దైనందిన జీవితంలో సెల్ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. దీని ప్రభావంతో చిన్న, పెద్ద అనే వయస్సు తేడా లేకుండా చాలా మంది దృష్టి సంబంధ ఇబ్బందులకు గురవుతున్నారు. కంప్యూటర్ల వద్ద గంటల తరబడి పనిచేయడం వల్ల నేత్ర సమస్యలు ఎదుర్కొంటున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. పోషకాహారం లోపం, ఏ-విటమిన్, బయట తిరిగేటప్పుడు దుమ్ము, ధూళి కణాలు కంటిలో పడటం, అధిక ఎండల వల్ల కళ్లు పొడిబారిపోవడం వంటివి కంటి సమస్యలకు కారణాలవుతున్నాయి.
ఎండలోకి వెళ్లేవారు కళ్లద్దాలు ధరించాలని మన్యం జిల్లా అంధత్వ నివారణాధికారి సుకుమార్ తెలిపారు. కంటి నుంచి నీరు కారడం, దురద, మంట వంటి ఇబ్బందులు ఎదురైతే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అంధత్వ నివారణ సంస్థ జిల్లా అధికారి నగేష్‌రెడ్డి మాట్లాడుతూ దృష్టి లోపం ఉన్న వారు పోషకాహారం తీసుకోవాలని, ఏ-విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారం పిల్లలకు పెట్టాలని తెలిపారు. పిల్లలు చదివేటప్పుడు, బోర్డు వైపు చూసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారో గుర్తించి వైద్య నిపుణులను సంప్రదించాలని చెప్పారు.