SCR Cancelled Trains Due to Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తం 481 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. దీంతో పాటు 152 రైళ్లను దారి మళ్లించగా మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రద్దైన రైళ్లలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. పలు పాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. మంగళవారం ఆదిలాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరనున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు (నంబర్ 17206)ను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే: భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం కూడా పలు రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు చేసింది. విజయవాడ డివిజన్‌లో అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టికెట్ల రద్దు కోసం స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ కొట్టుకుపోవడంతో మార్గమధ్యలో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు.
రైళ్లు నిలిపివేసిన ప్రాంతాల్లో ప్రయాణికులకు స్నాక్స్, ఆహారం, మంచినీళ్లు అందజేస్తున్నామని తెలిపారు. ట్రాక్‌లపై వరద వెళ్లిపోగానే పునరుద్దరణ పనులు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్‌లు కోతకు గురవ్వడంతో పాటు పట్టాలపై వరదనీరు ప్రవహించడంతో పునరుద్దరణ పనులు కొనసాగించలేకపోతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
రద్దయిన వాటిలో ముఖ్యమైన రైళ్ల వివరాలు
భారీగా బస్సు సర్వీసులు రద్దు: తెలంగాణలో కీలకమైన హైదారాబాద్ - విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలు చోట్ల వరద ప్రవహిస్తోంది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ 560కి పైగా బస్సులను రద్దు చేసింది. రద్దైన వాటిలో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులున్నాయి.