Trains Cancelled in Rains : భారీ వర్షాలు, వరదలు కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 80 రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, మరో 49 రైళ్లను దారి మళ్లించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు.
రాయనపాడు, కొండపల్లి, కే.సముద్రం రైల్వే స్టేషన్లలో పూర్తిగా వరదనీరు వచ్చి చేరింది. ట్రాక్‌లపైకి వరదనీరు భారీగా చేరడంతో రైళ్లను వెనక్కు కానీ, ముందుకు కానీ తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఐదు రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. భారీగా వరదనీరు ఉన్న స్టేషన్లలో ప్రయాణికులను తరలించేందుకు సుమారు 70 ఆర్టీసీ బస్సులను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అసలు బస్సులు కూడా వెళ్లలేని స్టేషన్లకు జేసీబీలు, ట్రాక్టర్లతో ప్రయాణికులను తరలించామన్నారు.
రైళ్లు నిలిపివేసిన ప్రాంతాల్లో ప్రయాణికులకు స్నాక్స్, ఆహారం, మంచినీళ్లు అందజేస్తున్నామని తెలిపారు. ట్రాక్‌లపై వరదనీరు వెళ్లిపోగానే పునరుద్దరణ పనులు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్‌లు కోతకు గురవ్వడంతో పాటు పట్టాలపై వరదనీరు ప్రవహించడంతో పునరుద్దరణ పనులు కొనసాగించలేకపోతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే : సింహాద్రి ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, గంగా కావేరి ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్ తదితర ఎక్స్‌ప్రెస్‌లను స్టేషన్లలో నిలిపివేశారు. సికింద్రాబాద్ - గుంటూరు, విశాఖపట్టణం - సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, కాకినాడ పోర్ట్- లింగంపల్లి, గూడూరు - సికింద్రాబాద్, భధ్రాచలం-బల్లార్ష, బల్లార్ష-కాజీపేట్, కాజీపేట్-డోర్నకల్, హైదరాబాద్-షాలీమర్, సికింద్రాబాద్-హౌరా, సికింద్రాబాద్ -తిరువనంతపురం, మహబూబ్ నగర్ -విశాఖపట్టణం, లింగంపల్లి- సీఎస్.టీ ముంబాయి, కరీంనగర్ - తిరుపతి, మచిలీపట్నం- విశాఖపట్నం, విశాఖపట్నం - మచిలీపట్నం రైళ్లను రద్దు చేశారు.
అలాగే ధర్మవరం - మచిలీపట్నం, మచిలీపట్నం - ధర్మవరం , లింగంపల్లి- నర్సాపూర్, నర్సాపూర్- లింగంపల్లి, ఏలూరు- కాకినాడ, కాకినాడ - బెంగళూరు, విజయవాడ - గుంటూరు, గుంటూరు -మాచర్ల, కాచిగూడ - మిర్యాలగూడ, మిర్యాలగూడ -నడికుడ, విశాఖపట్నం- విజయవాడ, విశాఖపట్నం -కడప, కాకినాడ-తిరుపతి మార్గాల్లో రైళ్లను రద్దుచేశారు. కాజిపేట - విజయవాడ సెక్షన్లో 20 రైళ్లును రద్దు చేశారు.
పలు రైళ్లు దారి మళ్లింపు : హౌరా, విశాఖపట్నం,భువనేశ్వర్, చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్, కన్యాకుమారి, బెంగళూరు, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల నుంచి బెంగళూరు,విజయవాడ,తిరుపతి,గోవా, చెన్నై ,సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి, షాలిమార్, సంత్రగచి, నిజాముద్దీన్‌కు వెళ్లవలసిన పలు రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, కడప, సికింద్రాబాద్, గుంతకల్, రేణిగుంట నుంచి పలు రైళ్లలు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హెల్ప్ లైన్ నంబర్స్
- హైదరాబాద్ : 27781500
- సికింద్రాబాద్ : 27786140, 27786170
- కాజీపేట : 27782660,8702576430
- వరంగల్ : 27782751
- ఖమ్మం : 27782985,08742-224541,7815955306
- విజయవాడ : 7569305697
- రాజమండ్రి : 0883-2420541,0883-2420543