Attack On Students for Money in Nandyal : ఏపీలోని నంద్యాల పట్టణ శివారులోని ఎస్‌డీఆర్ పాఠశాల సమీపంలో కొందరు ఆకతాయిలు ఇద్దరు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు కథనం ప్రకారం, ఆగస్టు 1న ఎస్‌డీఆర్ పాఠశాల ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఓ ఇంటర్ విద్యార్థిని సుబ్బయ్య, శంకర్, మరికొంత మంది అడ్డగించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దుస్తులు విప్పదీసి ఈడ్చుకెళ్లి.. తన వద్ద డబ్బు లేదని విద్యార్థి చెప్పాడు. దీంతో అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆ విద్యార్థి తనకు తెలిసిన బీటెక్ విద్యార్థి లోకేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేశాడు. జరిగిందంతా అతనికి వివరించాడు. దీంతో అతను వెంటనే అక్కడికి రాగా, ‘డబ్బులు ఇవ్వాలని అడిగితే నువ్వెందుకు వచ్చావ్’ అంటూ దుండగులు లోకేశ్వర్‌రెడ్డి పైనా దాడికి పాల్పడ్డారు. దుస్తులు విప్పదీసి రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో పాటు ఛాతీపై కూర్చొని కొట్టారు. అతని చెవి కొరికి తీవ్రంగా గాయపరిచారు. ఈ వీడియో ఆదివారం (ఆగస్టు 4న) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఆస్తి కోసం కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి - హత్యలో అన్నదమ్ముల హస్తం
ఈ సంఘటన జరిగిన రోజు నుంచి లోకేశ్వర్‌రెడ్డి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు కనీసం కేసు పెట్టలేదంటూ బాధితుడు వాపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేశారు. ఈ దారుణం పాఠశాల సమీపంలో జరగ్గా, స్కూలు యాజమాన్యమే కేసు నమోదు కాకుండా అడ్డుకుందనే ఆరోపణలు స్థానికులు నుంచి వస్తున్నాయి. నిందితులు సుబ్బయ్య, శంకర్, మరికొందరిపై ఆదివారం (ఆగస్టు 4న) కేసు నమోదు చేసినట్లు నంద్యాల గ్రామీణ సీఐ దస్తగిరిబాబు తెలిపారు.