Teak Wood Smuggling Case in Mancherial : 'పుష్ప' సినిమా వచ్చిన తర్వాత 'అల్లు అర్జున్'ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ చిత్రంలో ఎర్రచందనాన్ని తరలించేందుకు 'పుష్పరాజ్' ఎన్ని ఎత్తులు వేస్తాడో, బయట మనోళ్లు అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో పోలీసులకు ఇలాంటి సీనే ఎదురైంది. అటవీ ప్రాంతంలో కొట్టిన టేకు కలపను తరలించేందుకు స్మగ్లర్లు నదిని ఎంచుకున్నారు. పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి నది మార్గం ద్వారా దుంగలను తరలించాలనుకున్నారు. అందుకోసం ప్రాణహిత నదిని వినియోగించుకున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి ప్రాణహిత నది తీవ్రంగా ప్రవహిస్తుంది. ఇదే అదనుగా నది ద్వారా కలప దుంగలను అక్రమంగా రవాణా చేయాలనుకున్నారు.
కలప దుంగలను నది ద్వారా తరలిస్తే ఎవ్వరికీ అనుమానం రాదనుకున్నారు. వారు అనుకున్న ప్రణాళికను అమలు చేశారు. టేకు దుంగలను నదిలో తెప్పలా మార్చి తరలించే ప్రయత్నం చేశారు. ముందస్తు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ సరిహద్దులో చోటు చేసుకుంది. ప్రాణహిత నదిలో తరలిస్తున్న రూ.3.70 లక్షల విలువైన అక్రమ కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
'అందిన కాడికి దోచుకో పుష్పా' ఇది మన జగనన్న ప్రభుత్వం
టేకు కలప తరలిస్తున్నారని స్థానికుల ద్వారా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా టేకు కలప దుంగలతో చేసిన తెప్ప కన్పించిందని అటవీ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.3.70 లక్షలు ఉంటుందన్నారు. మొత్తం 20 కలప దుంగల తెప్పను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. వీటిని ఎవరు తరలించారనే దానిపై విచారణ జరుపుతున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న కలపను రేంజి కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. అడవిలో అక్రమంగా దుంగలను కొట్టి, తరలిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అటవీ అధికారులు పేర్కొన్నారు.