Boy Died After Being Hit by a Vehicle Tire at ORR : సినిమాల్లో ఓ వ్యక్తి కొబ్బరి చెట్టు కింద ఉంటూ మిత్రులతో మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో చెట్టు పైనుంచి కొబ్బరి బొండా అతని నెత్తి మీద పడుతుంటుంది. వెంటనే ఆ వ్యక్తి అక్కడే ప్రాణం విడిచిపెడతాడు. ఇది చూసి అతని స్నేహితులు దురదృష్టం అంటే ఇదేనేరా చెట్టు కింద కూర్చోవడం ఏంటి అదే సమయంలో కొబ్బరి బొండం పైనుంచి పడడం ఏంటి అది పడడంతో అతను ప్రాణాలు విడడం ఏంటని ప్రశ్నలు వేసుకుంటారు. అది సినిమా అవ్వడం వల్ల అలాంటి సీన్స్ ఉంటాయి. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటి సీన్ ఒకటి జరిగింది. అప్పుడు కూడా దురదృష్టం అంటే ఇదేనేమో అన్నట్లుగా ఉంటుంది ఈ వార్త చదివితే.
అవుటర్ రింగ్ రోడ్డుపై ఓ బాలుడు మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు అతనికి తగులుతుంది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఆశ్చర్య విషాదకరమైన సంఘటన పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో జరిగింది. ఇదే దురదృష్టం అంటే ఎందుకంటే ఎక్కడినుంచో ఓ టైరు వచ్చి బాలుడికి తగలడం ఏంటి అతడు మరణించడం ఏంటి మరి.
ఈ విషాదకరమైన సంఘటనపై పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ ఎస్సై సోమేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం, అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్‌రెడ్డి ఆదివారం రాత్రి ముత్తంగి దాబాలో భోజనం చేసేందుకు కారులో కుటుంబ సభ్యలతో పాటు బయలుదేరి వెళ్లారు. సరిగ్గా సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్ ఎక్కిన కాసేపటికి వారి కుమారుడికి మూత్రం వచ్చింది. దీంతో వారు కారు పక్కకు ఆపారు. అనంతరం ఆ చిన్నారి దిగి మూత్ర విసర్జన చేస్తుండగా గుర్తు తెలియని వాహనం టైరు వేగంగా దొర్లుకుంటూ వచ్చి అతడిని బలంగా తగిలింది. దీంతో బాలునికి తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన బాలుడి తల్లిదండ్రులు తీవ్రగాయాలైన ఆ చిన్నారిని హుటాహుటిన ముత్తంగిలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నగరంలో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ చిన్నారికి చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ఏదైనా వాహనం టైరు ఊడిపోయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి బాలుడిని బలంగా ఢీకొట్టి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
దుండిగల్ సర్వీస్ రోడ్డుపై లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురు విద్యార్థులు స్పాట్ డెడ్