SIT Inquiry Adulteration Ghee Case : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వైనంపై గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. రెండోరోజు ఆదివారం సభ్యులంతా సమావేశమై, ఎవరెవరు ఏయే అంశాలు విచారించాలో బాధ్యతలు పంచుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు సూత్రధారులు, పాత్రధారులపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. ఏఆర్ డెయిరీకి టెండర్లు అప్పగించడం సహా సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.
టెండర్ నిబంధనలేంటి? అమలు తీరేంటి? : సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజీ డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు టీటీడీ ఈవో శ్యామలరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఏఆర్ డెయిరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు అడిగినట్లు తెలిసింది. నాటి టెండర్‌లో ప్రాథమికంగా ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? వాటిలో గరిష్ఠ, కనిష్ఠ ధరలపై సరఫరా చేసేందుకు టెండరు వేసిందెవరు వంటి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. గుత్తేదారు ఎంపిక, టెండరు అప్పగింత ఎలా జరిగింది, సరఫరా తీరు ఎలా ఉంది వంటి అంశాలను ఈవో నుంచి తెలుసుకున్నట్లు సమాచారం.
అనంతరం సిట్ అధికారులు ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలను సేకరించారు. సాధారణంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాక సాంకేతిక బిడ్లలో అర్హత సాధించేందుకు అవసరమైన ఫైళ్లను అందించారా లేదా అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్థిక బిడ్లకు వెళ్లే ముందు టెండర్లలో పాల్గొనే సంస్థలను పరిశీలించాకే ఆమోదం తెలపాల్సి ఉందని అప్పుడు ఏఆర్ డెయిరీ సంస్థను పరిశీలించి నివేదిక ఇచ్చిందెవరో మురళీకృష్ణని అడిగినట్లు సమాచారం.
SIT Investigation Tirumala Laddu Adulteration : ఎల్-1గా వచ్చిన సంస్థకు పూర్తిస్థాయిలో నెయ్యిని కట్టబెట్టే ముందు, ఎల్-2 కూడా అదేధరపై సరఫరాకు ముందుకొస్తే, 65:35 ప్రాతిపదికన కట్టబెట్టే పద్ధతి ఉందా అని సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ఒకవేళ ఉంటే, కిలో నెయ్యి రూ.319కి ఇచ్చేందుకు మరే సంస్థనైనా ముందుకొచ్చిందా? టెండర్లు పిలిచినప్పుడు మార్కెట్‌లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ధర ఎంతుందో పోల్చి చూశారా వంటి ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.
టెండర్లలో ఏఆర్ డెయిరీ సంస్థ తొలుత ఎంతకు కోట్ చేసింది? రివర్స్ టెండరింగ్ తర్వాత ఎంత తగ్గించింది? తదితర ప్రశ్నలు వేసినట్లు సమాచారం. మొత్తంగా ఈ సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో సిట్ ఆరా తీసింది. ఈ క్రమంలోనే దర్యాప్తులో వేగాన్ని పెంచింది. మార్కెట్‌లో కంటే తక్కువ ధరను కోట్ చేసినప్పటికీ, టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి ఎందుకు ఆమోదించిందో తెలపాలంటూ సంబంధీకులకు తాఖీదులు పంపించే ఆస్కారముంది. ఏఆర్ డెయిరీకి కూడా నోటీసులు ఇవ్వనుంది. అదేవిధంగా ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్లు తెలిసింది.