Diwali Bonus Singareni Retired Workers : సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు సంబంధించి దీపావళి బోనస్ రూ.18.27 కోట్లను ఈ నెల 27న కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని సింగరేణి సీఎండీ బలరామ్ వెల్లడించారు. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ స్కీమ్(దీపావళి బోనస్) సొమ్మును విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ 1 నుంచి అక్టోబరు 24, 2024 మధ్యలో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికులకు ఈ సొమ్మును జమచేయనున్నట్లుగా తెలిపారు.
రూ.18.27 కోట్ల దీపావళి బోనస్ : రిటైర్డ్ అయిన 2,754 మంది కార్మికులకు దీపావళి బోనస్ కింద ఒక్కొక్కరికి గరిష్ఠంగా 93,750 రూపాయలు చొప్పున మొత్తం 18 కోట్ల 27 లక్షల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న రిటైర్డు కార్మికుల ఖాతాల్లో జమ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని సీఎండీ బలరామ్ ఆర్థిక , సిబ్బంది వ్యవహారాల విభాగం ఉన్నతాధికారులను ఆదేశించారు.