Rains Effect on Singareni Coal Production : రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణివ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి రెండోరోజు ఆటంకం ఏర్పాడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద చేరింది. ఓపెన్ కాస్ట్ రోడ్లన్నీ బురద మయంగా మారాయి. 6 వేల టన్నుల బొగ్గు వెలికితీత నిలిచిపోగా, సంస్థ కోటి మేర ఆదాయం కోల్పోయింది. పెద్ద పెద్ద మోటార్ల సాయంతో నీరును ఎప్పటికపుడు తోడేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఉపరితల గనుల పరిధిలోనూ 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. భారీ యంత్రాలు బురద రోడ్లలో కదలలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేదాకా, ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో వరదనీటి చేరికతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మూడ్రోజులుగా వర్షాలతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్ గనుల్లోకి చేరిన వర్షపునీరు చేరింది. మందమర్రి ఉపరితల గనుల్లో నీటిచేరికతో యంత్రాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. ఇల్లందు, కోయగూడెం ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరింది. 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలతో ఓపన్ కాస్ట్ గనుల్లో వరద నీరు నిలువ ఉండి బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. భారీ యంత్రాలు బురద రోడ్లతో కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎక్కడికక్కడే భారీ యంత్రాలు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి అవరోధాలు ఏర్పడ్డాయి. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడితేనే బొగ్గు ఉత్పత్తి సజావుగా జరిగే పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వెల్లడించారు.
80 శాతం ఉత్పత్తిపై ప్రభావం: ఉపరితల గనుల్లో భారీ యంత్రాలు నడిచే పరిస్థితి లేక 80 శాతం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం నిల్వ బొగ్గును రవాణా చేస్తూ, దానినే ఉత్పత్తి కింద చూపిస్తోంది. సింగరేణి సంస్థ రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గును 20 శాతం భూగర్భ గనుల నుంచి, 80 శాతం ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి చేస్తోంది. ఈ నెల 15 నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపరితల గనుల్లోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారడంతో భారీ యంత్రాలు లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. వర్షాల నేపథ్యంలో క్వారీల్లో ఉన్న భారీ యంత్రాలను అధికారులు ముందు జాగ్రత్తగా పైకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకూ 1,46,595 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు. శుక్రవారం కూడా ఉపరితల గనుల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. సింగరేణికి 19 ఉపరితల గనులు ఉండగా, భూగర్భ గనులు 23 వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో రహదారులను సిద్ధం చేసే పనుల్లో యంత్రాంగం నిమగ్నమైంది.
వానలే వానలు - ఉప్పొంగుతున్న వాగులు - బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు - Heavy Rain Alert To Telangana