Old Age Couple Murder Case : మద్యం తాగితే అతను మనిషి కాదు. కంటికి కనిపించిన మహిళ వయసుతో సంబంధం లేదనే విధంగా అతని ప్రవర్తన ఉంటుంది. లైంగికంగా వేధించడం, డబ్బు కోసం వేధించడం, ఒప్పుకోకుంటే చంపడం. మళ్లీ మద్యం మత్తు దిగితే సాధారణంగా ప్రవర్తించే నేరగాడు అతడు. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లా కందుకూరులో వృద్ధ జంటను హత్య చేసిన నిందితుడి జీవన విధానం ఇది. ఒంటరిగా ఊరి చివరన ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడిన నిందితుడిని రాచకొండ పోలీసులు పట్టుకున్నట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన మూగ ఊషయ్య, శాంతమ్మల జంట హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. పెళ్లిళ్లకు బ్యాండ్ వాయించే దసర్లపల్లికి చెందిన ఉప్పుల శివ కుమార్ వృద్ధ దంపతులను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ముష్టిపల్లికి చెందిన చింతపల్లి మనోహర్ రావుకు చెందిన 8 ఎకరాల మామిడి తోటలో వృద్ధ దంపతులు కూలీ పనులు చేస్తూ నివసిస్తున్నారు. మనోహర్ రావు ఊషయ్యకు ఫోన్ చేసినప్పుడు కాల్ రిసీవ్ చేయకపోవడంతో మరో వ్యక్తిని వెళ్లి చూడాలని కోరాడు. ఆ వ్యక్తి వెళ్లి చూసేసరికి వృద్ధులిద్దరూ రక్తం మడుగులో పడి ఉన్నారు.
వెంటనే మనోహర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడిని 48 గంటల్లోపు పట్టుకున్నారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతున్న శివ కుమార్, తోటలోకి వచ్చి శాంతమ్మను లైంగిక వాంఛ తీర్చమని వేధించాడని, ఆ వృద్ధురాలు ఒప్పుకోకపోవడంతో పక్కన ఉన్న కొడవలితో ఆమెను కడతేర్చాడని పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న ఊషయ్య అక్కడకు చేరుకోవడంతో పోలీసులకు సాక్ష్యంగా ఉంటాడని, అతన్ని సైతం కడతేర్చినట్టు నిందితుడు విచారణలో ఒప్పుకున్నట్లు వెల్లడించారు.
2023 క్రైమ్ సీన్ రిపీట్ : ఇదే నిందితుడు 2023 మార్చి 4వ తేదీన శైలజా రెడ్డి అనే మరో మహిళను హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. గతంలో ఉన్న కేసు ఆధారంగా విచారణలో భాగంగా నిందితుడి వేలి ముద్రలను పరీక్షించినట్లు సీపీ తెలిపారు. ఆరోజు దొరికిన వేలిముద్రలు, నిందితుడు శివకుమార్ వేలిముద్రలు సరిపోవడంతో ఆ కోణంలో విచారించారు. అప్పడూ తానే మద్యం మత్తులో చేశానని నిందితుడు ఒప్పకున్నట్లు తెలిపారు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ చేసినట్లు తెలిపారు. దసర్లపల్లి గ్రామంలో అరుణ ఫామ్ హౌస్‌లో ఉంటున్న శైలజా రెడ్డిని తన కుటుంబ సభ్యులు ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి చొరబడి అకారణంగా ఆమెపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. అప్పుడు మృతురాలి కుమారుడు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందుకూరు ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసును పట్టుకుని తీగ లాగితే డొంక కదిలినట్టు, గతంలో ఉన్న కేసులో కూడా నిందితుడినని శివకుమార్ ఒప్పుకున్నాడని సీపీ తెలిపారు.
అయితే మత్తులో ఇన్ని చేసిన తర్వాత కూడా మద్యం మత్తు దిగగానే సాధారణంగా ప్రవర్తించే వాడని సీపీ తెలిపారు. విచారణలో నిందితుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడన్నారు. కానీ అప్పటికే ముగ్గురి ప్రాణాలు బలి తీసుకున్న వ్యక్తికి చట్టపరంగా ఉండే శిక్షలు ఉంటాయన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. త్వరలో రివార్డులు ఇస్తామని తెలిపారు.
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది - చికిత్స పొందుతూ మృతి
భర్తతో చనువుగా ఉంటూ భార్యపై కన్నేశాడు - అడ్డుతొలగించేందుకు ఏడేళ్ల కుమార్తెను హత్య చేశాడు