Shiva Annapureddy Facebook Account Disabled : న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి తన రూపం, పేరు మార్చేసుకుని 'శివ అన్నపు రెడ్డి' పేరిట ఇంత కాలం కొనసాగిస్తున్న ఫేస్‌బుక్ ఖాతాను తొలగించేశారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత కూడా ఫేస్బుక్లో ఆయన అకౌంట్ కొనసాగింది. 'సీబీఐ వెతుకుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే అనే శీర్షికతో ఈనాడు పత్రిక ప్రధాన సంచికలో మంగళవారం ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో తన ఉనికి ఎవరికి చిక్కకుండా ఉండేందుకు మంగళవారం ఉదయానికల్లా ' శివ అన్నపురెడ్డి' పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాను ఆయన తొలగించారు.
న్యాయమూర్తులపై దూషణల కేసులో సీబీఐ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నమణి అన్నపురెడ్డి ఇటీవల అమెరికా నుంచి స్వదేశానికి తిరిగొచ్చి, శివ అన్నపురెడ్డి పేరుతో చలామణి అవుతున్నారు. వైసీపీ యూఎస్ఏ కన్వీనర్‌గా ఉన్న ఆయన దర్యాప్తు సంస్థకు చిక్కకుండా, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు రూపం మార్చుకొని అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలతో చేతుల్లో చేయి వేసుకొని మరీ ఫొటోలు దిగారు. వాటిని ఎప్పటికప్పుడు ' శివ అన్నపు రెడ్డి' పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. అధికార పార్టీకి మద్దతుగా పోస్టు చేస్తున్నారు. అన్ని రకాల ఆధారాలు, ఫొటోలతో ఈనాడు పత్రికలో ప్రచురించటంతో ఉలిక్కిపడి, తన ఫేస్‌బుక్ అకౌంటును తొలగించేశారు.
హైకోర్టుకు న్యాయవాది ఫిర్యాదు : న్యాయవాదులను, న్యాయవ్యవస్థను దూషించిన 'శివ అన్నపురెడ్డి' పేరుతో చలామణీ అవుతున్న మణి అన్నపురెడ్డి విదేశాలకు పారిపోకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసేలా సీబీఐకి ఆదేశాలివ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయవాది వి.వి. లక్ష్మీనారాయణ మంగళవారం ఫిర్యాదు చేశారు. తక్షణమే చట్టప్రకారం ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయమూర్తులపై దూషణల కేసు పూర్వాపరాలు, వాటిలో మణి అన్నపురెడ్డి పాత్ర, ప్రస్తుతం ఆయన స్వదేశానికి వచ్చి వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తీరు తదితర అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఫిర్యాదుకు ‘ఈనాడు’ కథనాన్ని జతపరిచారు. ఫిర్యాదు ప్రతిని సీబీఐ ఎస్పీకి కూడా పంపించారు.