SEVERE SNORING LEADS TO CANCER : గురకే కదాని ఈజీగా తీసి పారేయకండి. మునుపు ఊహించిన దాని కన్నా దీని పరిణామాలు అతి తీవ్రంగా ఉంటున్నట్టు తాజా ఓ అధ్యయనం సూచిస్తోంది. ఇది పలురకాల క్యాన్సర్లకూ దారితీస్తోందని హెచ్చరిస్తోంది. నిద్ర పోతున్నప్పుడు కొందరికి గొంతు వెనకాల భాగం వదులై పాక్షికంగానో, పూర్తిగానో బ్రీతింగ్ మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో ఊపిరాడక ఉన్నట్టుండి శ్వాస తీసుకుంటూ బిగ్గరగా గురక పెడతారు. దీన్నే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని కూడా అంటారు. అంటే నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోతుందన్నమాట. దీంతో తాత్కాలికంగా బ్లడ్లో ఆక్సిజన్ మోతాదులు తగ్గుతాయి. ఇదే పెను ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది.
స్లీప్ అప్నియాకూ హార్ట్ అటాక్, రక్తనాళాల సమస్యలు, నాడీ జబ్బుల వంటి వాటికీ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే తెలుసు. జీర్ణకోశ, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నట్టూ తాజా అధ్యయనాలలో ఇప్పుడు బయటపడింది. ఈ స్టడీలో స్లీప్ అప్నియా గల 1,990 మందిని 13 ఏళ్ల పాటు పరిశీలించారు. వీరిలో 181 మంది (సుమారు 9%) క్యాన్సర్ మహమ్మారి బారినపడ్డట్టు గుర్తించారు. నమూనా సంఖ్య పరంగా చూస్తే ఇది చాలా ఎక్కువని పరిశోధకులు వివరిస్తున్నారు. మామూలు వారితో పోలిస్తే స్లీప్ అప్నియా గలవారిలో క్యాన్సర్ కేసులు 26% అధికంగా ఉంటున్నట్టు గత అధ్యయనంలో తేలింది. ఈ గురక సమస్య ఎంత తీవ్రంగా ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటున్నట్టు తాజా అధ్యయనం చెబుతోంది. వరల్డ్ వైడ్గా దాదాపు 100 కోట్ల మంది గురకతో బాధపడుతున్నారని అంచనా. అయినా దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ట్రీట్మెంట్ తీసుకోవటం అటుంచి అసలు సమస్య నిర్ధరణ కానివారే ఎక్కువ. స్లీప్ అప్నియా గల ప్రతి 10 మందిలో 9 మందికి అసలు ఆ విషయమే తెలియకపోవటమే ఇందుకు తార్కాణం.
అసలు ఎలా కారణమవుతుంది?
గురక మూలంగా బ్రీతింగ్ సాఫీగా తీసుకోకపోవటం లేదా మొత్తానికే ఆగటం వల్ల బ్లడ్లో ఆక్సిజన్ మోతాదులు తగ్గుతాయి. దీంతో డీఎన్‌ఏను క్షీణింపజేసే కారకాలు పుట్టుకొస్తాయి. ఇవి డీఎన్‌ఏలో హానికర మార్పులకు దోహదమవుతాయి. దాని ఫలితంగా క్యాన్సర్ల ముప్పు హెచ్చుగా పరిణమిస్తుంది. నిద్ర పోతున్నప్పుడు తరచూ బ్లడ్లో ఆక్సిజన్ మోతాదులు తగ్గుతూ వస్తుంటే విశృంఖల కణాలు (ఫ్రీరాడికల్స్), వీటి పని పట్టే యాంటీఆక్సిడెంట్ల మధ్య సమతుల్యత లోపిస్తుంది (ఆక్సిడేటివ్ స్ట్రెస్). విశృంఖల సెల్స్ అస్థిరంగా ఉంటాయి. ఇవి కణాల పైపొరలు, ప్రొటీన్లు, డీఎన్‌ఏను చాలా వరకు దెబ్బతీస్తాయి. అంతర్గత వాపు (ఇన్‌ఫ్లమేషన్)ను సైతం ప్రేరేపిస్తాయి. వాపు నుంచి కాపాడుకోవటానికి మానవ శరీరం సైటోకైన్లనే ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. వీటిల్లో కణాలను అనుసంధానించే అణువులు (క్యామ్స్) ఉంటాయి. ముఖ్యంగా వీసీఏఎం-1 అనే అణువులు క్యాన్సర్లు తలెత్తటంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి కణితి కణాలను రక్తనాళాల లోపలి పైపొర కణాలకు అంటుకునేలా, సిరలు గోడలను దాటుకొని వెళ్లేలా చేస్తాయి. ఇలా కణితి డెవలప్ అవడానికి, ఇతర భాగాలకు క్యాన్సర్ విస్తరించటానికి కారణమవుతాయి.