Several People Died in Road Accident: వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో 8 మంది ప్రాణాలు కోల్పోగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో ఇద్దరు మృతి చెందగా హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మరో ఇద్దరు, చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లాలోని కుట్లూరు మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో గార్లదిన్నె పని కోసం వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మృతులు తాతయ్య (55), చిననాగమ్మ (48), రామాంజనమ్మ (48), పెదనాగమ్మ (60), కొండమ్మ, జయరాముడు, చిననాగన్నగా గుర్తించారు. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ, డీఎస్పీ వెంకటేశ్వరులు పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ వినోద్‌కుమార్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు.
సీఎం చంద్రబాబు విచారం: ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
చంద్రబాబుపై రాళ్లదాడి కేసు - పోలీసుల అదుపులో నిందితులు
భర్త, కుమారుడు దుర్మరణం: గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం చెందారు. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి, ఆయన భార్య సురేఖ, కుమారుడు హరినాథ్ రెడ్డి కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఖాజీపేట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ముగ్గురూ గాయపడ్డారు. తెనాలి ఆసుపత్రికి తరలించగా అప్పటికే తండ్రి, కుమారుడు మృతి చెందారు. హరినాథ్ రెడ్డి ఐటీఐ చదువుతుండగా అతని చదువు కోసం కుటుంబం నంబూరులో ఉంటోంది. తుములూరులో బంధువు మృతి చెందగా ఆ కార్యక్రమానికి వెళ్లి తిరిగి నంబూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భర్త, కుమారుడిని కోల్పోయిన సురేఖ తీవ్రంగా రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
పొలాల్లోకి దూసుకుపోయిన ఆటో: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం చల్లవానిపేట కూడలి సమీపంలో లింగాలవలస వద్ద ఆటో పొలాల్లోకి దూసుకుపోయి బోల్తా పడింది. చల్లవానిపేట నుంచి నరసన్నపేట వస్తున్న ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని నరసన్నపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
విమానాల్లో ప్రయాణం - స్టార్ హోటళ్లలో విడిది - ఏం చేస్తారో తెలిస్తే షాక్