Road Accidents in Andhra Pradesh : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద ఇవాళ ఉదయంఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి పై మంగళగిరి నుంచి విశాఖపట్టణం శీతల పానీయాల తో వెళుతున్న ట్రాలీ లారీ కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు ట్రాలిలారీ ని ఢీకొంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి మొదట డివైడర్ను ఢీకొట్టంతో పాటు ఎదురు గా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. కారు నుజ్జను నుజ్జు అవటం తో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రం గా గాయపడిన మహిళను కారు నుంచి బయటకు తీసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృతులు తమినాళనాడు వాసులు గా గుర్తించారు. ఫైనాన్స్ వ్యాపారం చేసి స్వామినాథన్ తన కుటుంబం తో కలిసి కొవ్వూరు వచ్చి తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వీరవల్లి పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతులు స్వామినాథన్(35), రాకేష్ (12 ), రాధ ప్రియా (14 ), గోపి (31 )కాగా, తీవ్ర గాయాలపాలైన సత్య (30 ) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి పై ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా కారును హైవే పెట్రోలింగ్ సిబ్బంది పక్కకు తీశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రెండు వేర్వేరు ప్రమాదాలు సంభవించాయి. సోమవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో సి.మల్లవరం వద్ద తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని మరో రోడ్డులోకి దూసుకెళ్లిన కారులో మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అదే మార్గంలో ఎం.కొంగరవారిపల్లి వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నెల్లూరు నుంచి వేలూరు సి.యం.సి ఆసుపత్రికి వెళుతూ ఎం.కొంగరవారిపల్లి వద్ద డివైడర్ను బలంగా ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కారు నుంచి ఒక మృతదేహాన్ని మాత్రమే పోలీసులు బయటకు తీయగలిగారు. మరో మూడు మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తీవ్ర గాయాలైన మరో ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ల నిద్రమత్తే ఈ ప్రమాదాలకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి కావడంతో రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చంద్రగిరి పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు సీఐ శ్రీరాములు తెలిపారు.
Kakinada District: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద కారు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు విశ్రాంత జడ్జి వి.మోహన్‌కుమార్, శ్రీనుగా పోలీసులు గుర్తించారు. మోహన్‌కుమార్ ఏపీ రెరా ఎడ్జ్యూడికేటింగ్ అధికారిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం.కొంగవరం, కృష్ణాజిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం- ముగ్గురు యువకులు మృతి - Three Youths Died in Road Accident