NagarKurnool Roof Collapse Tragedy in Telangana : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్లలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలిన ఘటనలో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇంటి పెద్దకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు పద్మ (తల్లి), పప్పి, వసంత (కుమార్తెలు), విక్కీ (కుమారుడి)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూలు జిల్లాలోని వనపట్ల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో గొడుగు భాస్కర్ (36) అనే వ్యక్తి ఇంటి మట్టిమిద్దె కూలింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు చనిపోయారు. గొడుగు భాస్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భాస్కర్ భార్య పద్మ (26) వీరి ఇద్దరి కూతుర్లు తేజస్విని, వసంత, కుమారుడు రుత్విక్ మృతి చెందారు. అభం శుభం తెలియని చిన్నారులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో వనపట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Roof Collapse In NagarKurnool Today : ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను నాగర్‌కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆర్డీఓ, తహసీల్దార్ మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మట్టి ఇళ్లలో ఉంటున్న వారికి పోలీసులు తగు సూచనలు చేశారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండకూడదని సూచించారు. సురక్షితమైన నివాసాల్లో ఉండాలని ప్రజలను కోరారు. వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
మట్టిమిద్దె కూలి కూలడంతో నలుగురు చనిపోయారు. మృతులకు పరిహారం అందించే విధంగా కృషి చేస్తాం. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పాతబడిన ఇండ్లలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తాం. మృతుల కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతాం. - తహసీల్దార్