Senior IAS Praveen Prakash Takes Back Voluntary Retirement : స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మనసు మార్చుకుని, మళ్లీ సర్వీసులో చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని తొందరపాటున నిర్ణయం తీసుకున్నానని, అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని అందులో పేర్కొన్నారు.
ప్రభుత్వంలోని ముఖ్యుల్ని కలిసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్‌మెంట్ ఆడిగారు. ఆయన్ను కలిసేందుకు వారు విముఖత వ్యక్తం చేశారు. ఆయన విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించారు. ఇక ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ను తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర వివాదాస్పద అధికారిగా పేరు పొందడంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ను పక్కన పెట్టింది. బదిలీ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయమని కూటమి ప్రభుత్వం ఆదేశించింది.
కూటమి ప్రభుత్వంలో తనకు సరైన పోస్టింగ్ దక్కదని భావించిన ఆయన ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే జూన్ 25న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరబ్ కుమార్ ప్రసాద్ జులై మొదటి వారంలో జీవో జారీ చేశారు. ఆయన వీఆర్‌ఎస్ సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విద్యాశాఖలో నాటి పెద్దల దొంగ విద్యలు - విద్యా కానుకకు టెండర్ లేకుండానే కాంట్రాక్ట్ - Irregularities in Vidya Kanuka
ఓ వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ : జగన్ అధికారంలోకి వచ్చాక స్వల్ప వ్యవధిలోనే ఆయన కోటరీలో ముఖ్యుడిగా మారిపోయిన ప్రవీణ్ ప్రకాష్‌పై అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుపడింది. సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శిగా ఏకకాలంలో రెండు పోస్టులు నిర్వహిస్తూ చక్రం తిప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా లెక్కచేయనంతగా ఆయన హవా సాగింది. అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంలో, కేసులు పెట్టించడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ పాత్రే కీలకమన్న ఆరోపణలున్నాయి.
విశాఖలో 450 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి జగన్ కట్టించుకున్న విలాసవంతమైన భవనాలకు రుషికొండను ఎంపిక చేయడంలోనూ ఆయన పాత్ర ఉందని చెబుతారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపు వంటి అవకతవకల్లో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన పూర్తిగా సహకరించినట్లు ఆరోపణలున్నాయి.
ఎన్నికల వేళ ఈ మీటింగ్లేలా ? బాధ్యతా - స్వామిభక్తా ? - PraveenPrakash Meeting with Parents