Second Vande Bharat Express From Secunderabad to Visakhapatnam : సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) నేడు పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్స్ షెడ్లు, 3 కోచ్ రెస్టారెంట్లు, 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణరకు శ్రీకారం చుట్టారు.
రైల్వేకు కొత్త సొబగులు- వందేభారత్ ప్రమాణాలతో అన్ని బోగీలు
Second Vande Bharat Express in Telugu States : ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఒక్క గురువారం తప్ప మిగిలిన అన్ని రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రెండు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో సేవలందిస్తోంది. దీనికి ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన ఉండడంతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపిస్తున్నారు.
ఈ రైలు సాధారణ సేవలు విశాఖపట్నం-సికింద్రాబాద్(Vizag to Secunderabad) వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టికెట్ల బుకింగ్స్ నేటి నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.
వందేభారత్ స్లీపర్ కోచ్ రెడీ- పరీక్షల తర్వాత పట్టాలపైకి! సౌకర్యాలు అదుర్స్
వందేభారత్ రైలు సమయం : రైలు నంబరు 20707 సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 05:05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు 20708 విశాఖపట్నం-సికింద్రాబాద్ రైలు మధ్యాహ్నం 14:35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి రాత్రి 23:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మార్గ మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగుతుంది. ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏడు ఏసీ చైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్‌లతో ప్రయాణిస్తుంది. అన్ని కోచ్‌లలో కలిపి 530 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది.
వందేభారత్ రైలుపై దుండగుల రాళ్లదాడి- అద్దాలు ధ్వంసం
కర్నూలు రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో పనులకు పచ్చజెండా ఊపారు. కర్నూలు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కోసం మొత్తం 45 కోట్ల రూపాయలు కేటాయించారు. రైల్వే ఆధునీకరణలో భాగంలో రాష్ట్రానికి 9 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని గుంటూరు డివిజన్ మండల రైల్వే అధికారి రామకృష్ణ తెలిపారు.
గుంటూరు- గుంతకల్లు, గుంటూరు- నంద్యాల డబ్లింగ్ లైన్లు సహా పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఆర్ఎం రామకృష్ణ, భాజపా నేతలు పాల్గొన్నారు. కోచ్ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకవచ్చినట్లు రామకృష్ణ తెలిపారు. స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి పథకానికి మోదీ శ్రీకారం చుట్టారని, వాటిని ప్రజలంతా ప్రోత్సాహించాలని విజ్ఞప్తి చేశారు.