Sweet Sorghum to Ethanol Production : జొన్నల వాడకం మనకు బాగా తెలిసిందే. తెల్ల, పచ్చ జొన్నలతో రోటీతో పాటు ఇతర ఆహార పదార్ధాలు చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. మన ఆరోగ్యానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం వీటినే కాకుండా తియ్యటి జొన్న పంట సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. పెట్రోల్ దిగుమతిని తగ్గించేందుకు అలాగే పర్యావరణాన్ని కాపాడేందుకు పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలని, కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి తగ్గట్టుగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
తియ్యటి జొన్నలో పుష్కలంగా ఇథనాల్ : ప్రస్తుతం పెట్రోల్లో 12 శాతమే ఇథనాల్‌ను కలుపుతున్నారు. ఇప్పటి వరకు చెరకు నుంచి తీసిన ఇథనాల్‌ను మాత్రమే ఇందులో విని యోగిస్తున్నారు. దీని విస్తీర్ణం రోజురోజుకూ తగ్గడంతో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవట్లేదు. దీంతో ఇథనాల్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. తియ్యటి జొన్న పంటలో ఇథనాల్ పుష్కలంగా లభిస్తుందని గ్రహించి, భారత వ్యవసాయ పరిశోధన మండలి తోడ్పాటుతో దీని ఉత్పత్తిపై దృష్టి సారించారు. ఐకార్‌కు అనుబంధంగా పనిచేసే హైదరాబాద్ భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ దేశవ్యాప్తంగా తియ్యటి జొన్నను విత్తనోత్పత్తి కోసం సాగు చేస్తోంది.
"పెట్రోల్ బంకుల్లో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపాలని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని అంటోంది. అందుకే తియ్యటి జొన్నలో ఇథనాల్ పుష్కలంగా లభిస్తుందని గ్రహించింది. అందుకే ఈ పంటపై భారత చిరు ధాన్యాల పరిశోధన సంస్థ దృష్టి పెట్టింది. ఈ పంటకు రాబోయే రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అలాగే మార్కెటింగ్ కష్టాలు ఉండవు." - ఉమాకాంత్ రెడ్డి, సహ సంచాలకులు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, వరంగల్
Sweet Jowar Crop in Telangana : ఇందులో భాగంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనూ రెండు ఎకరాల్లో జైకార్ రసీలా రకం జొన్న సాగు చేయగా అది కోత దశకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పంట సాగుకు నేతృత్వం వహిస్తున్న ఐఐఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ ఉమాకాంత్ తన బృందంతో కలిసి ఇటీవల వరంగల్‌లో సాగైన జొన్నను పరిశీలించారు. ఈ తియ్యటి జొన్న నుంచి ఇథనాల్‌ను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా యంత్రాలు అక్కర్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పుడు చెరకుకు వాడుతున్న యంత్రాలనే వీటికీ ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. చక్కెర కర్మాగారాల్లో ఏడాదిలో మూడు నుంచి నాలుగు నెలలు ఈ ఉత్పత్తి నిలుస్తుంది. ఆ సమయంలో వాటిలో ఈ జొన్న పంట నుంచి ఇథనాల్‌ని వెలికితీయవచ్చు. త్వరలో ఇదో మంచి వాణిజ్య పంటగా మారే అవకాశం ఉండడమే కాకుండా, పశువులకు మేతగా కూడా బాగా పనికొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి డిమాండ్ బాగా ఉంటుంది కాబట్టి రైతులకు, మార్కెట్ కష్టాలు కూడా ఉండవు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సాగు చేపడుతున్నా భవిష్యత్‌లో ఈ సాగు విస్తీర్ణం పెంచనున్నారు.
Ethanol industries: రూ.4,018 కోట్లతో... 250 ఎకరాల్లో... 4 పరిశ్రమలు