School Buses Checking In Rangareddy : పాఠశాలలు ప్రారంభం కావడంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాలల ప్రారంభం రోజే రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా ఝులిపించారు. బస్సుల కండీషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు.
School BUS Fitness Tests : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 40 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులకు జరిమానాలు విధించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్రంలో బడిగంట మోగింది - పిల్లల సందడి మొదలైంది - Telangana Schools Reopening
School Buses Checking In Hyderabad : హైదరాబాద్ జిల్లాలో 17 పాఠశాలల బస్సులను సీజ్ చేశామని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ రమేష్ తెలిపారు. అందులో పది బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,290 బడి బస్సులుండగా 923 బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారని ఇంకా 367 బస్సులకు ఫిట్నెస్ చేయించుకోలేదని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డెక్కే బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,824 పాఠశాలల బస్సులుండగా ఇప్పటి వరకు సుమారు 15వేల పైచిలుకు బస్సులకు మాత్రమే ఆయా పాఠశాలల యాజమాన్యం ఫిట్‌నెస్ చేయించినట్లు తెలుస్తోంది.
ఇంకా సుమారు 9వేల పైచిలుకు బస్సులకు ఫిట్‌నెస్ చేయించలేదని సమాచారం. ఫిట‌్‌నెస్ చేయించని బస్సులను రోడ్లపై తిప్పితే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లలోనూ పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పరిమితికి లోబడే విద్యార్థులను తీసుకెళ్లాలని డ్రైవర్లు సహా యజమాన్యాలకు సూచించారు.
"స్కూలు బస్సులను నడిపే డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్ వేసుకోవాలి.ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేసి సీజ్ చేశాం. నిబంధనలకు విరుద్దంగా బస్సులను రోడ్లపై తిప్పితే సీజ్ చేస్తాం. ఆటోలు, వ్యాన్లలో పరిమితికి లోబడే విద్యార్థులను తీసుకెళ్లాలి." -భీంసింగ్, రామగుండం రవాణాశాఖ అధికారి
బడి తెరిచే వేళాయే - స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్ట్ మస్ట్ గురూ - లేకుండా రోడ్డెక్కితే జైలుకే - School BUS Fitness tests Karimnagar'
ప్రైవేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు'