Sarvai Papanna Jayanthi Celebrations In Hyderabad : సర్వాయి పాపన్న 374వ జయంతి సందర్భంగా ఆయన ధీర గాధను, జీవిత చరిత్రను నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమంటూ స్మరించుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. బడుగు బలహీన వర్గాలపై కొనసాగిన అణిచివేత దాడులకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడని కొనియాడారు. వేములవాడలో ప్రభుత్వవిప్ ఆదిశ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ యోధుడి ఆలోచన విధానాన్ని యువత కొనసాగించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని కేక్ కట్ చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య నివాళులర్పించారు. తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యధికార పోరాట యోధుడు పాపన్న అంటూ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరం నడిబొడ్డున పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
హైదారాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సర్వాయి పాపన్నకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణభవన్‌లో జరిగిన జయంతి ఉత్సవంలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ , సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ప్రారంభించింది తమ ప్రభుత్వ హయాంలోనేనని పేర్కొన్నారు.
సిద్దిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నివాళులర్పించారు. బడుగులకు రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్మరించుకున్నారు. ఏదో ఒక జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గౌడ సంఘాల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గౌడన్నలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక - గీత కార్మికులకు వేధింపులు : హరీశ్‌రావు