Delhi Liquor Scam Case Update : దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి సీబీఐ నమోదు చేసిన కేసులో అప్రూవర్‌గా మారారు. ఈ మేరకు రౌస్‌అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో సెక్షన్ 164 కింద శరత్ చంద్ర రెడ్డి వాగ్మూలం ఇచ్చారు. శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా నమోదు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి గతంలో ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారగా ఇప్పుడు సీబీఐ కేసులోనూ అప్రూవర్‌గా వాంగ్మూలమిచ్చారు.
ఆ కేసులోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. శరత్ చంద్రా రెడ్డిని కవిత బెదిరించినట్లు సీబీఐ తెలిపింది. దిల్లీ మద్యం విధానంలో శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్న ఐదుజోన్లకు ఒక్కో జోన్‌కి రూ. 5 కోట్ల చొప్పున 25 కోట్లు కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 25 కోట్లు ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి నిరాకరించడంతో కవిత బెదిరించినట్లు పేర్కొంది. ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహాడ్ జైలులో ఉన్నారు.