SANKRANTI HOLIDAYS FOR SCHOOLS : స్కూల్ విద్యార్థులకు సంక్రాంతి నిజంగా పండుగే తెచ్చింది. తెలంగాణలో ఈ నెల 11 నుంచి 17 వరకు మొత్తం ఏడు రోజులు సెలవులు ప్రకటించగా ఏపీ ప్రభుత్వం అంతకు మించి మరో సెలవు ఇచ్చేసింది. రాష్ట్రంలో అతి పెద్ద పండుగ కావడంతో దేశ విదేశాల్లో స్థిర పడిన వారంతా సంక్రాంతికి స్వస్థలానికి రావడం ఆనవాయితీ. ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో స్థిర పడిన వారంతా తిరిగి ఒక్క చోట కలుసుకుంటుంటారు. అందుకు తగ్గట్లుగానే బంధుమిత్రులంతా దాదాపు పది రోజుల పాటు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. దీంతో పల్లెల్లో కోలాహలం ఉంటుంది. ఊరూ, వాడా పండుగ సందడి మార్మోగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు 10 రోజులు సెలవులు ప్రకటించింది.
విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పది రోజులపాటు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 10 నుంచి 19 వరకు.. అంటే పది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జనవరి 20న సోమవారం తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కనుమ అంటేనే కోనసీమ - ప్రభల తీర్థంపై ప్రధాని మోదీ లేఖ
20న తెరుచుకోనున్న పాఠశాలలు
ఇదిలా ఉండగా సంక్రాంతి సెలవులపై సామాజిక మాధ్యమాల్లో పలు విధాలుగా ప్రచారం కొనసాగుతోంది. గతంతో పోలిస్తే ఈ సారి సెలవులు తగ్గించనున్నారని ప్రచారం జరిగింది. తెలంగాణలో దసరా పండగకు, ఏపీలో సంక్రాంతికి ఎక్కువగా సెలవులు ఇస్తుంటారు. అలాంటిది సెలవులు తగ్గించనున్నారనే ప్రచారంతో ప్రజలు, ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులు నిరుత్సాహం చెందుతున్నారు. కాగా, సెలవుల ప్రచారంలో పుకార్లకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు (19 ఆదివారం) పండుగ సెలవులు ఉంటాయని 20వ తేదీ పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరం క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
అకడమిక్ క్యాలెండర్లో 44 సెలవులు
2025 విద్యా సంవత్సరం సెలవుల జాబితాను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఇటీవలే విడుదల చేశారు. ఆ ప్రకారం 2025లో మొత్తం 23 సాధారణ, 21 ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు ఉన్నాయి. అవన్నీ కలిపితే మెుత్తం ఈ ఏడాది 44 రోజులు సెలవులు రానున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో 4 ఆదివారం కావడం గమనార్హం. గణతంత్ర్య దినోత్సవంతో పాటు ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం పండుగలు ఆదివారం వస్తుండడం విశేషం.