Sanitation Workers Problems in Nellore Corporation: చేస్తున్న పనికి ఇస్తున్న వేతనానికి సంబంధం లేకుండా ఉందని పారిశుద్ద్య కార్మికులు ఇటీవల సమ్మె చేశారు. కనీసం పరికరాలు లేకుండానే పారిశుద్ద్య విభాగంలో పని చేస్తున్నామని వీరు అంటున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో పని చేస్తున్న ఒప్పంద పారిశుద్ద్య కార్మికులు ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండానే భూగర్బ డ్రైనేజిల్లోకి వెళ్లి మురుగును తీస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కొద్ది జీతం కోసం పని చేయక తప్పదని వారు వాపోతున్నారు.
'సమస్యలపై మేము రోడ్డెక్కాం - పట్టించుకోకుండా సీఎం జగన్ ఆడుకుంటున్నారు'
నగరంలోని కలెక్టరేట్ పక్కనే మురుగు కాలువలు పారుదల కావడం లేదు. భూగర్భ డ్రైనేజిల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో మూసుకుపోయాయి. వాటిని తొలగించేందుకు కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 54 డివిజన్లలో మురుగుపారుదల సరిగా ఉండదు. నిత్యం పారిశుద్ద్య కార్మికులు లోపల పేరుకు పోయిన చెత్తను వ్యర్ధాలను తొలగిస్తారు. అందులో గాజుపలుకులు, సీసా పెంకులు ఉంటాయి. ఆసుపత్రి నుంచి వచ్చే వ్యర్ధాలు, సూదులు ఉంటాయి. మరుగుదొడ్డిలోని పైప్ లైన్లు ఇందులోకి వస్తాయి. వీటన్నింటిని తొలగించాలంటే భూగర్భ డ్రైనేజిలోకి కార్మికులు వెళ్లి బయటకు తీస్తున్నారు.
'మాట తప్పి, మడమ తిప్పిన జగన్' - సమ్మె బాటన ఉద్యోగులు, కార్మికులు, వాలంటీర్లు
కార్మికుల ఆరోగ్యం నిమిత్తం కార్పొరేషన్ అధికారులు వీరికి చేతులకు గ్లౌజులు ఇవ్వరు. కాళ్లకు బూట్లు లేవు. మాస్కులు లేవు. దుర్వాసన వస్తున్నా గాజు పెంకులు, సూదులు గుచ్చుకుంటున్నా తీయక తప్పదని వారు వాపోతున్నారు. పేరుకు 15 వేలు జీతం అయినా చేతికి వచ్చేది 13 వేల రూపాయలే. లోపలి నుంచి వచ్చే గ్యాస్కి, వ్యర్ధాలకు జ్వరాలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో 1200 మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా నిత్యం జ్వరాలతో బాధపడుతున్నారు. వీరికి హెల్త్ స్కీములపై కూడా అవగాహన లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కార్పొరేషన్ అధికారులు డ్రైనేజిని శుభ్రం చేసే సిబ్బందికి రక్షణ పరికరాలు మాత్రం ఇవ్వడం లేదు.
మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను జగన్మోహన్ రెడ్డి మరచిపోయారు - ఈ నెల 21వరకు డెడ్లైన్
మేము అన్ని పనులు చేస్తున్నాం. కానీ మేము చేసే పనికి, వచ్చే జీతానికి అస్సలు గిట్టుబాటు కావడం లేదు. గ్లౌజులు, బూట్లు అన్నీ ఇవ్వాలి కానీ మాకు ఇక్కడ ఏం ఇవ్వలేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెత్త ఎత్తే డబ్బాలు కూడా సరిగా లేవు అన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఇలా ఏమీ లేకుండా చెయ్యడం వల్ల ఆరోగ్యం పాడవుతోంది. జ్వరాల బారిన పడుతున్నాము - పారిశుద్ద్య కార్మికుడు
ఈ పని చాలా కష్టం. కాలువల్లో దిగాలి. డ్రైనేజీల్లో దిగాలి. కానీ మాకు గ్లౌజులు, మాస్కులు లేవు. చెత్త తియ్యడానికి పనిముట్లు లేవు. చెత్తలో గాజు పెంకులు ఉన్నా అలాగే తీయాలి. మాకు జీతాలు పెంచుతామన్నారు కానీ పెంచలేదు.- పారిశుద్ద్య కార్మికుడు