Sand Dunes in Crop Lands at Khammam : ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు అన్నదాతకు మిగిల్చిన కష్టాలకు సాక్ష్యం! ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే మొత్తం 79,914 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 54,045 మంది రైతులు పంటలు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. అత్యధిక విస్తీర్ణంలో దెబ్బతింది. 41,450 ఎకరాల్లో వరి పైర్లు ధ్వంసం కాగా, 30,460 మంది రైతులు పెట్టుబడులు కోల్పోయారు.
31,119 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. దీనికి తోడు పొలాల్లో మేటవేసిన ఇసుక, రాళ్లు రప్పలతో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. ఖమ్మం అర్బన్, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, చింతకాని మండలాల్లోని పంట క్షేత్రాలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. మున్నేరు వరద విలయంతో ఖమ్మం గ్రామీణం, ఖమ్మం అర్బన్ మండలాల్లోని పెద్ద ఎత్తున పంట పొలాలు కోతకు గురయ్యాయి.
పచ్చని పొలాల్లో 5 అడుగుల మేర ఇసుక మేటలు : ఆకేరు ఉద్ధృతికి తిరుమలాయపాలెం మండలంలోని పంటలు, పాలేరు ఏటి వరదలతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు కప్పాయి. ఎకరా వరి సాగుకు ఇప్పటికే రూ.20 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. వరద ధాటికి ఇప్పటికే పెట్టుబడులు పోగా, పంట చేలలో సుమారు 5 అడుగుల మేర వేసిన ఇసుక మేటలను చూసి రైతులు బోరుమంటున్నారు. పొలంలో ఇసుక మేటలు తొలగించడంతో పాటు చదును చేసేందుకు నాణ్యమైన మట్టి పోయాల్సి ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 50 వేల రూపాయల వరకు ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
"భారీ వర్షాలకు మూడు ఎకరాల వరకూ పంట నష్టం ఏర్పడింది. సుమారు లక్ష రూపాయలు వరకు పెట్టుబడి పెట్టాను. చివరకు పురుగుల మందు తాగి చనిపోవాలన్న ఆలోచన వచ్చింది. ప్రభుత్వ సాయం సైతం రూ.10,000 ప్రకటించింది. అది ఎందుకూ సరిపోదు. రైతు బంధు కూడా ఇప్పటి వరకూ పడలేదు." -బాధిత రైతులు
ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఎటూ సరిపోదు : పాలేరు నియోజకవర్గంలోనే దాదాపు 5 వేల ఎకారాల్లో ఇసుక మేటలు వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ లెక్కన ఎకరాకు రూ.50 వేల ఖర్చు అంటే, నియోజకవర్గ రైతులపై మొత్తం రూ.25 కోట్ల మేర అదనపు భారం తప్పేలా లేదు. ఇక కోతగు గురైన ప్రాంతాల్లో రెట్టింపు ఖర్చు తప్పేలా లేదు. ఒక్క పాలేరు ఏటి పరివాహక ప్రాంతంలోనే 1200 ఎకరాల్లో పంట భూములు పూర్తిగా కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
వీటిని మళ్లీ బాగుచేసుకోవాలంటే ఎకరాకు లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఇసుక మేటలు తొలగించకపోతే, రాబోయే 2, 3 పంటల దిగుబడులపైనా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు మళ్లీ లక్షలు పోసి పొలం బాగు చేసుకునే పరిస్థితి లేక ఏం చేయాలో దిక్కుతోచట్లేదని కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు. శతాబ్ద కాలంలో లేని విధంగా ముంచెత్తిన వరదతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లిందని సర్కార్ అంగీకరిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే ఎకరాకు 10వేల రూపాయల సాయం ప్రకటించింది. ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్న వేళ పరిహారం పెంపు అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి పొంగులేటి చెబుతుండటం వారికి కొంత భరోసానిస్తోంది.
"రైతన్నలకు ప్రభుత్వ సాయం అందించే పదివేల రూపాయలు ఏమాత్రం సరిపోవు. కానీ రాష్ట్ర పరిస్థితి కూడా అన్నదాతలకు తెలుసు. పంట పొలాలను నేను స్వయంగా చూశాను. చాలా చోట్లు ఐదడుగుల మేర ఇసుక మేట వేసింది. కేంద్ర ప్రభుత్వం సైతం అదే చెబుతుంది. సెంట్రల్ నుంచి కొంత నిధుల సాయం అందాక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది." -పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి