Telangana Samagra Kutumba Survey : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శనివారం అరకొరగా మొదలయ్యింది. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంకా స్టిక్కర్లు అంటిస్తుండగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బంజారా హిల్స్‌లోని మంత్రుల నివాస గృహ సముదాయంలో సర్వే చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లి సర్వే అధికారులు వివరాలు సేకరించారు. వాస్తవానికి ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గణన అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించుకున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో సర్వే : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇళ్లు చాలా ఉండడంతో తమకు కేటాయించిన ఇళ్లకు గణన అధికారులు స్టిక్కర్లు అంటించలేకపోతున్నారు. అవసరమైన కాగితాలు సకాలంలో అందకపోవడంతో పాటు ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు మధ్యాహ్నం తర్వాత రావడంతో సర్వే మందకొడిగా సాగింది. మతం, కులం, రాజకీయ నేపథ్యం వంటి సమాచారం చెప్పేందుకు కొంత మంది తిరస్కరించారు. బ్యాంకులో రుణాలు, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ వంటి సమాదానాలు చెప్పట్లేదు. పాతబస్తీలో కొన్ని చోట్ల స్టిక్కర్లను చింపేస్తున్నారు. మరి కొన్నిచోట్ల సర్వే అధికారులను ఇళ్లలోని రానివ్వట్లేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, గౌతమ్‌లు సర్వేను పర్యవేక్షించారు.
పాతబస్తీ రూటే సపరేటు : పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ పూర్తిస్థాయిలో స్టిక్కర్లు అతికించలేదు. స్టిక్కర్లు లేకపోవడం, మలక్‌పేట, చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు ఉండడంతో సమస్యలు తప్పడం లేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రజలు సరైన సమాధానాలు ఇవ్వట్లేదు. చాంద్రాయణగుట్ట పరిధిలో కొన్నిచోట్ల ఇళ్లకు అతికించిన స్టిక్కర్లు చింపేస్తున్నారు.
మలక్‌పేట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, నాంపల్లిలో సర్వేకు వెళ్లిన అధికారులకు స్టిక్కర్లు ఎందుకు అతికిస్తున్నారు? మాకొద్దంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు. షాదీముబారక్ డబ్బులు రాలేదు? వివరాలను ఎందుకు చెప్పాలి? అంటూ మరికొందరు ప్రశ్నించారు. తమ ఇళ్లకు రావొద్దంటూ అక్కడి ప్రజలు చెప్పడంతో అధికారులు కార్పొరేటర్లకు ఫోన్లు చేశారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇద్దరు కార్పొరేటర్లు గణన అధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో వచ్చి దగ్గరుండి వివరాలు చెప్పిస్తామన్నారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రొ ఫార్మాల కొరత : మరోవైపు ఇంటి సర్వే కోసం అధికారులు లక్షల సంఖ్యలో ప్రొఫార్మాలు, స్టిక్కర్లు తెప్పించినా సరిపోలేదు. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు రోజులకు 85 శాతం ఇళ్లకే స్టిక్కర్లు అతికించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి. ఖైరతాబాద్, నాంపల్లి, విజయనగర్ కాలనీ, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, నారాయణగూడ, ఆబిడ్స్ ప్రాంతాల్లో 40 శాతం ఇళ్లకు శనివారం రాత్రికి కూడా స్టిక్కర్లు అతికించలేదు.
చేవెళ్ల, శంకర్‌పల్లి, ఎదులాబాద్, యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాబాద్, తలకొండపల్లి, కేశంపేట్, నందిగామ వంటి ప్రాంతాల్లో, పాస్‌బుక్ వివరాలు, ఆస్తులు, రుణాల వంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడం లేదు. ఘట్‌కేసర్, పోచారం, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలు, ఫిర్జాదీగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్, నిజాంపేట, బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లలో శనివారం మధ్యాహ్నం నుంచి ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు.
సమగ్ర కుటుంబ సర్వే : 'ఆ వివరాలు చెప్పాలనుకుంటే చెప్పండి - లేదంటే 999 ఆప్షన్ ఎంచుకోండి'
'మేం రిచ్ పీపుల్ - ఈ సర్వే మాలాంటి వారికి కాదు - మేం ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు'