Saffron Cultivation In Hyderabad : కశ్మీర్‌కే పరిమితమైనటువంటి కుంకుమ పువ్వును ఇప్పుడు భాగ్యనగరంలోనూ పండిస్తున్నాడు ఓ యువకుడు. కశ్మీర్ శీతల వాతావరణంలో కుంకుమ పువ్వు సాగు జరుగుతుందని అందరికీ తెలిసిందే. ఈ పంట పండించాలనే ఆలోచన చేసింది వ్యవసాయదారుడు కాదండోయ్. గుర్రంగూడకు చెందిన బీటెక్ స్టూడెంట్ లోహిత్‌రెడ్డి. తనకు వ్యవసాయం చేయడంపై అమితమైన ఆసక్తి ఉండటంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం అదే ట్రెండ్‌గా మారింది. అనుకున్నంత స్థాయిలో ఉత్పత్తి జరిగితే హైదరాబాద్ నగరంలోనే కుంకుమ పువ్వును పండించే అవకాశం వస్తుంది.
ఏవిధంగా కుంకుమపువ్వు సాగు చేస్తారంటే? : 270 చదరపు అడుగులున్నటువంటి గదిలో గాలిలో తేమ, ఉష్ణోగ్రత సమతుల్యంలో ఉండాలి. ట్రేలలో కుంకుమ పువ్వు సాగు చేపట్టాడు. ఉష్ణోగ్రత పగటి వేళ 17 డిగ్రీలు, రాత్రి 9 డిగ్రీలు ఉండేవిధంగా చూసుకోవాలి. అక్టోబరు మొదటివారంలో 2 లక్షల రూపాయలు వెచ్చించి కశ్మీర్ నుంచి 200 విత్తనాలు తెచ్చి సాగు మొదలెడితే డిసెంబరు నెలలో కుంకుమ పువ్వు ఉత్పత్తి వస్తోంది. ఒక విత్తనానికి రెండు నుంచి మూడు పువ్వులు వస్తాయి. వీటిపై గ్రాముకు రూ.800-1000 ధర లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న సాగుతో 150 గ్రా. వరకు దిగుబడి వస్తుందనే అంచనా ఉంది. ఒక్కసారి ఈ పంట సాగుకు పెట్టుబడి పెడితే మున్ముందు ఖర్చు చేయకుండానే పూల ఉత్పత్తి వస్తుంది.
ఏవిధంగా తెలుసుకున్నాడంటే? : గూగుల్, యూట్యూబ్‌లలో ఈ పంటకు సంబంధించిన వీడియోలను వీక్షించాడు. సాగు చేసే ప్రాంతాలకు వెళ్లి మెలకువలు తెలుసుకుని కుంకుమ పువ్వు సాగుకు ఉపక్రమించాడు.
70 గ్రాముల కుంకుమపువ్వు దిగుబడి వచ్చింది : బడంగ్‌పేట మున్సిపాలిటీలోని గుర్రంగూడకు చెందిన సింగిరెడ్డి లోహిత్‌రెడ్డి ఇబ్రహీంపట్నం గురునానక్ కళాశాలలో సీఎస్‌ఈ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. గూగుల్‌లో సాగు చూసి ఆకర్షితుడైనట్టుగా వివరించాడు. ఇప్పటి వరకు 70 గ్రాముల కుంకుమ పువ్వు వచ్చిందని పెంపకం చాలా సులభంగానే ఉందని తెలిపాడు.
సిద్దిపేటలో కుంకుమపువ్వు సాగు : మరోవైపు సిద్ధిపేటలో కూడా కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. సహజంగా చలి ప్రదేశాలైనటువంటి కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోనే కుంకుమ పువ్వును విస్తారంగా సాగుచేస్తున్నారు. అయితే, వర్షాధార పంటలకు నెలవైనటువంటి తెలంగాణలోని సిద్దిపేటలోనూ కుంకుమపువ్వు ఉత్పత్తి మొదలైంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలోని డీఎక్స్‌ఎన్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ వారు ఏరోఫోనిక్ విధానంలో గత జులైలో ప్రయోగాత్మకంగా వీటి పెంపకం చేపట్టారు.
ఈ పూలు బాగా కాస్ట్లీ గురూ - కేజీ పండిస్తే 4 తులాల బంగారం కొనేయొచ్చు!