Ruling Party Representative Anarchies in Eluru District: దోచుకోవడం దాచుకోవడంలో వైసీపీ నేతలది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్! కొంతమందిది స్వీయ దోపిడీ అయితే మరికొందరిది అస్మదీయ దోపిడీ. కైకలూరు కథ అలాంటిదే. ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. దాని సహజసిద్ధ స్వభావాన్ని కాపాడేందుకు సరస్సు పరిసరాల్లో నిర్మాణాలకు, చెరువుల తవ్వకానికి అనుమతి ఉండదు. కానీ అధికార అండతో, యంత్రాంగం సహకారంతో ఇక్కడి ప్రజాప్రతినిధి మాత్రం కొల్లేరు పరిధిలో ఇష్టానుసారం తవ్వేస్తూ మట్టిని తరలిస్తూ ఆ చెరువుల అద్దెల రూపంలో ఏటా కోట్లు వెనకేసుకుంటున్నారు.
వైసీపీ నేతల అధికార గర్వం - అర్చకులపై ఆగని దాడులు - YSRCP Leaders Attacks on Priests
రౌడీగ్యాంగ్లతో దాడులు: ప్రజాప్రతినిధి కుమారుడు చూసేందుకు వినయ విధేయలతో కనిపించినా ఏకంగా ఓ రౌడీగ్యాంగ్‌నే నడిపిస్తున్నారు. మాట వినకపోయినా, ఎదురుచెప్పినా ఆ రౌడీగ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే సొంత పార్టీ నాయకుడిపైనే ఈ రౌడీగ్యాంగ్ దాడి చేసి కొట్టిందంటే ఈ అయిదేళ్లలో వారి అరాచకాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు. కేసు నమోదు చేయాలన్నా ప్రభుత్వ కార్యాలయంలో పని కావాలన్నా పుత్రరత్నం అనుమతి తప్పనిసరి. రౌడీగ్యాంగ్ అరాచకాలు శ్రుతి మించడంతో అధికార పార్టీ నాయకులే విమర్శలు గుప్పించారు. వారిపైనా కక్షగట్టి, కేసులు పెట్టించారు. స్థానికంగా ప్రజాప్రతినిధికి, కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేక ఓ మహిళా నాయకురాలు విజయవాడ వెళ్లి మరీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని ఒక పంచాయతీ వార్డు సభ్యుడు పౌర అంశాల్లో కీలకంగా ఉంటారు. టీడీపీ సానుభూతిపరుడు కూడా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేస్తూ వివరాలు సేకరిస్తుంటారు. ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిపైనా స.హ.చట్టం కింద దరఖాస్తులు చేసి సమాచారం రాబట్టడం వారికి నచ్చలేదు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేయించారు. ఒక రోజు పంచాయతీ గ్రామసభ జరుగుతుండగా రౌడీగ్యాంగ్ వచ్చి యువతితో అసభ్యంగా ప్రవర్తించావని నిందిస్తూ దాడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించడానికి ప్రయత్నించగా కేసులు పెడతామని బెదిరించి వెనక్కి తగ్గేలా చేశారు.
జగనన్న కాలనీల మీద లబ్ధి: పేదలకిచ్చే ఇళ్ల పట్టాల అంశంలోనూ ఈ ప్రజాప్రతినిధి చక్రం తిప్పారు. జగనన్న కాలనీల కోసం స్థలాల సేకరణ ఎక్కడ చేయనున్నారో ముందే తెలుసుకున్నారు. ఇంకేముంది బినామీలతో ఆ ప్రదేశాలలో భూములను తక్కువ ధరకే కొనిపించారు. ఒక మండల కేంద్రంలో దాదాపు 100 ఎకరాల లేఅవుట్ వేశారు. ఆ తర్వాత పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అప్పగించారు. ఇలా ఆ ప్రజాప్రతినిధి వెనకుండి నడిపించి భారీగా లాభపడ్డారు. ఆ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలను చదును చేయించడంలోనూ బాగానే వెనకేసుకున్నారు. అంతా అయ్యాక ఇళ్ల స్థలాలను పంచే క్రమంలోనూ తమ వారికే ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
అంటే ఒక్క జగనన్న కాలనీల మీదే మూడు రకాలుగా లబ్ధి పొందారన్నమాట. నియోజకవర్గానికి చెందిన 62 మంది రైతులంతా తమకున్న కొంత భూమిని కలిపి 100 ఎకరాల్లో చెరువుగా ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని చేపల సాగుకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ప్రజాప్రతినిధి పుత్రరత్నం కళ్లు ఈ చేపల చెరువుపై పడ్డాయి. బెదిరింపులతో అద్దెదారుడి నుంచి తమ చేతిలోకి తీసుకున్నారు. చెరువును ఇక తామే సాగు చేస్తామని ఇచ్చినంత తీసుకోండి అంటూ రైతులకు హుకుం జారీ చేశారు. చేపల చెరువును తామే స్వచ్ఛందంగా కౌలుకు ఇస్తున్నామని పత్రాలు రాయించి సంతకాలూ తీసుకున్నారు.
కొల్లేరులో అక్రమ తవ్వకాలు: ఈ ప్రజాప్రతినిధికి కొల్లేరు ఒక ప్రధాన ఆదాయ వనరు. తన కనుసన్నల్లోనే సరస్సును ఆనుకొని వందల ఎకరాల చెరువులు తవ్వించారు. ప్రాంతాన్ని బట్టి ఎకరానికి 20 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఏటా వసూలు చేస్తున్నారు. అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా అడ్డుకుంటారు. ఈ ప్రజాప్రతినిధి ఏ కార్యక్రమం నిర్వహించినా కొల్లేరు ప్రాంత ప్రజలంతా సొంత ఖర్చులతో హాజరుకావాల్సిందే. కొల్లేరు పరిధిలో తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ఓ అటవీశాఖ అధికారిని బదిలీ చేయించారు. కొల్లేరులో తవ్వకాలకు అవకాశం కల్పిస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు తెగబడ్డారీ తండ్రీకుమారుడు. ఆ తవ్విన మట్టినంతా ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమ స్థలానికి అడ్డుగా ఉన్నాయని నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో 50 గృహాలు, దుకాణాలను ఆక్రమణ పేరుతో తొలగించేలా చేశారు.