A Huge Scam RS 288 Crores in Telangana : రాష్ట్రంలో తప్పుడు పత్రాలతో రూ.288 కోట్ల భారీ మొత్తం జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను దాదాపు 350 మంది డీలర్లు దోచేశారు. కంపెనీలు తెరచి వ్యాపారం చేయకుండానే చేసినట్లు కాగితాలపై చూపి భారీ మొత్తంలో ఐటీసీ నొక్కేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిన్నర పాటు ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ చేసిన వ్యవహారాన్ని జీఎస్టీ అధికారులు ఆలస్యంగా గుర్తించి అప్రమత్తమై ఐదు రాష్ట్రాల్లోని డీలర్ల ఖాతాలను స్తంభింప చేయడం ద్వారా ప్రభుత్వ సొమ్మును కొంత వరకు కట్టడి చేయగలిగారు. జీఎస్టీ ప్రాక్టీషనర్‌ను అరెస్టు చేసిన అధికారులు ఇప్పటివరకు రూ.11 కోట్ల వరకు వివిధ కంపెనీల నుంచి రికవరీ చేసినట్లు తెలుస్తోంది.
జగిత్యాలలో చందాసాయికుమార్ జీఎస్టీ ప్రాక్టీషనర్ దాదాపు 32 బోగస్ సూట్‌కేసు కంపెనీలను సృష్టించి భారీగా అక్రమాలకు పాల్పడ్డాడు. జీఎస్టీ ప్రాక్టీషనర్ అయినందున ఎవరైనా కొత్తగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయాలంటే ఇతనినే కలిసేవారు. అదేవిధంగా వివిధ కారణాలతో తమ వ్యాపార సంస్థలను మూసివేయాలన్నా కూడా ఇతని వద్దకే వెళ్లి అందుకు కావాల్సిన ప్రక్రియను పూర్తి చేసేవారు. వివిధ కారణాలతో తమ వ్యాపార సంస్థలను మూసి వేయాలని తమ వద్దకు వచ్చిన వారి నుంచి పాన్, ఆధార్ కార్డులను సేకరించేవాడు.
జీఎస్టీ చట్టంలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని : జీఎస్టీ చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకొని కంపెనీలను మూసివేయమని తనకు ఇచ్చిన పాన్ నంబర్లు, ఆధార్ కార్డులను ఉపయోగించి ఫోన్‌నంబర్లు మార్చి వాటిని మూసివేయకుండా కొనసాగించాడు. క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండానే పేపర్‌పైనే లావాదేవీలు నిర్వహించినట్లు చూపించి తప్పుడు పత్రాలు జీఎస్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఇలా మొత్తం 32 బోగస్ సంస్థలను తెరచి వాటి ద్వారా అత్యధిక జీఎస్టీ స్లాబ్ ఉన్న సిమెంట్, ఐరన్లను వ్యాపారం చేసినట్లు కాగితాల్లో చూపించాడు.
తన బోగస్ సంస్థల ఖాతాల్లో జమైన ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ మొత్తాన్ని ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 350 మంది వ్యాపారులకు బదిలీ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలో 302 మంది వ్యాపారస్థులు ఉండగా, మరో 48 మంది వ్యాపారులు ఐదు రాష్ట్రాల్లో ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు.
జీఎస్టీ అధికారుల నిర్లక్ష్యం : జగిత్యాల కేంద్రంగా ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా జరిగిన రూ.288 కోట్ల ఐటీసీ కుంభకోణం 2022 అక్టోబరు నుంచి 2023 డిసెంబరు వరకు జరిగినట్లు అధికారులు తేల్చారు. ఈ కుంభకోణం బయటకు రాకుండా ఉండేందుకు అధికారులను మస్కా కొట్టించేందుకు ఈ ట్యాక్స్ కన్సల్టెంట్ ఐటీసీ 02 ఫార్మ్‌ను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆయా డివిజన్ల పరిధిలో ఉన్న జీఎస్టీ అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవడంతో వారు ఆడిందే ఆటగా సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబరు మూడో వారంలో ట్యాక్స్ కన్సల్టెంట్‌ను అరెస్టు చేశారు.
32 బోగస్ కంపెనీలు రూ.288 కోట్ల బదిలీ : 32 బోగస్ కంపెనీల నుంచి రూ.288 కోట్ల ఐటీసీని దాదాపు 350 ట్యాక్స్ పెయర్లకు బదిలీ అయినట్లు గుర్తించారు. అందులో అత్యధికంగా రూ.120 కోట్లను ఐటీసీ మొత్తం ఆర్మూర్ కేంద్రంగా ఏర్పాటు చేసిన బోగస్ కంపెనీకి వెళ్లినట్లు గుర్తించారు. మిగిలిన మొత్తాన్ని హైదరాబాద్‌లోని పంజాగుట్ట, చార్మినార్, సరూర్‌నగర్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలోని వివిధ వ్యాపార సంస్థలకు, మరికొంత మొత్తం ఏపీ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్రలకు ఐటీసీ బదలాయింపు చేసినట్లు గుర్తించారు.
17 మంది డీలర్ల బ్యాంకులు ఖాతాలు సీజ్ : దాదాపు 150 సంస్థల ఖాతాల్లోని ఐటీసీని స్తంభింప చేయడంతో పాటు మరో 17 మంది డీలర్లకు చెందిన బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపచేశారు. తాజాగా ఆయా సంస్థలు ఉపయోగించిన ఐడీలు తమకు ఇవ్వాలని కోరుతూ జగిత్యాల సహాయ కమిషనర్ ఆనందరావు డీజీపీ జితేందర్‌కు గత నెలలో లేఖ రాశారు. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా ఇటీవల వరకు కొనసాగిన ఓ జాయింట్ కమిషనర్ ఓ సంస్థ నుంచి దాదాపు రూ.8 కోట్ల వరకు లబ్ధి పొంది అరెస్టు కాకుండా కాపాడారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు రూ.11 కోట్లను ఐటీసీ లబ్ధి పొందిన వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.