Accidents Due To Cell Phone Using : గత కొన్నాళ్లుగా నగరంలో సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే పోలీసులు చలానాలు విధిస్తున్నా ఏటా సగటున 20-30 శాతం చొప్పున కేసుల పెరుగుదల ఉంటోంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదు.
వాహనం నడిపే సమయంలో సెల్‌ఫోన్ వినియోగిస్తే రూ.1000 జరిమానా విధించి వదిలేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ దొరికిన వారి లైసెన్సులో రెండు పాయింట్లు నమోదవుతాయి. ఇది 12కు చేరితే డ్రైవింగు లైసెన్సును రద్దు చేస్తారు. 2023 నుంచి 2024 జులై వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 89,056 రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9,773 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16,400 సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 1,15,229 నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల నష్టాలు : వాహనం నడుపుతూ ఫోన్ వినియోగించడం, కాల్స్ మాట్లాడడం వల్ల దృష్టి మళ్లుతుంది. సంభాషణ మీదే దృష్టి ఉండడం వల్ల వెనుక, ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలను గమనించలేరు. హారన్ శబ్ధాలు వినిపించవు. దీనివల్ల వాహనాలు ఢీకొట్టే ప్రమాదముంది. ఫోన్ వినియోగిస్తూ ఒకే చేత్తో డ్రైవింగ్ చేసినప్పుడు అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్లు లేదా ఎదురుగా ఏదైనా వస్తే వాహనం మీద నియంత్రణ కోల్పోయి అదుపు తప్పుతుంది. తెరను చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనం లేన్ ప్రకారం కాకుండా అటు ఇటుగా వెళ్తుంది. ఇది పక్క నుంచి ఇరువైపుల వాహనదారుల్ని ప్రమాదంలో పడేస్తుంది.
అలా డ్రైవ్ చేస్తున్నవారిలో యువతే అధికం : కాల్స్ వచ్చినప్పుడు ఎవరు చేశారో అనే తొందరలో ఒంటి చేత్తో నడపుతూ కిందపడిపోతుంటారు. ఒక చేతిలో హ్యాండిల్ లేదా స్టీరింగ్ ఇంకో చేతిలో ఫోన్ పట్టుకుంటారు. కొన్నిసార్లు ఫోన్ జారిపోతుంటే దాన్ని పట్టుకోబోయి ప్రమాదానికి గురైన ఉదంతాలు చాలానే ఉన్నాయి.
ట్రాఫిక్ పోలీసుల అధ్యయనం ప్రకారం నగరంలో రోడ్ల మీదకొచ్చే వాహనాల డ్రైవర్లలో సగటున 15 శాతం మంది సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హ్యాండ్ ఫ్రీ మోడ్ పరికరాలు ఉపయోగించే వారు 60-70 శాతం వరకూ ఉంటారని అంచనా. కాల్ వచ్చినప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపేవారు అరుదు. సాధారణ రోజులతో పోలిస్తే వారాంతాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్ అధికమని ఒక అధ్యయనంలో తేలింది. మొబైల్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేసేవారిలో అన్ని వర్గాల వారు ఉంటున్నా 18- 35 ఏళ్లవారు ఎక్కువమంది ఉంటున్నట్లు స్పష్టమైంది.
ట్రాఫిక్ పోలీసులు ఫోన్లు వినియోగించే వారికి చలానాలు విధిస్తున్నా బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్ వంటి పరికరాలపై దృష్టిసారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఫోన్ జేబులోనే ఉంటున్నా చెవులకు బ్లూటూత్ తగిలించుకుని డ్రైవింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారికి చలానాలు విధించకపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతోంది. హ్యాండ్ ఫ్రీ విధానం కింద బ్లూటూత్ వినియోగిస్తే జరిమానా విధించలేరు. దీంతో కొందరు బ్లూటూత్ పరికరాలతో పాటలు వింటూ, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. దీనివల్ల దృష్టి మళ్లి ప్రమాదాల బారినపడుతున్నారు. ఇలాంటి వాటిపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రోడ్డు ప్రమాదాల వల్ల తమ ప్రాణాలే కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు కారకులవుతున్నారు : మహేశ్ భగవత్