Road Accident in Suryapet District : పొట్టకూటి కోసం ఉదయాన్నే పనులకు వెళుతున్న కూలీలను రోడ్డు ప్రమాదం(Road Accident) పొట్టనబెట్టుకుంది. ఆర్టీసీ బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అయిదుగురిని కబళించింది. మరో ఏడుగురిని ఆస్పత్రి పాలుజేసింది. సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునగాల మండలం విజయరామపురం, రేపాల గ్రామాలకు చెందిన 12 మంది కూలీలు మోతె మండలం హుస్సేనాబాద్‌లో మిరప పనుల కోసం ఆటోలో బయలుదేరారు. మోతె సమీపంలోకి రాగానే పైవంతెన దిగే క్రమంలో విజయవాడ జాతీయ రహదారిపై అటుగా వచ్చిన మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. బస్సు ఢీకొనటంతో ఆటో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.
Auto and Bus Dhee : ఆటోలో ఉన్న ముగ్గురు కూలీలు కందుల నాగమ్మ, చెవుల నారాయణమ్మ, పోకల అనసూయమ్మ ఘటనస్థలిలోనే మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెమిడేల సౌభాగ్యమ్మ మృతి చెందింది. కందుల గురవయ్యను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య అయిదుకు చేరింది.
ప్రమాదం పట్ల రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పరామర్శించారు, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బడుగుల లింగయ్య డిమాండ్ చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు.
ఓఆర్ఆర్పై కారు బోల్తా : మరోవేపు సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కారులో మేడ్చల్ నుంచి సదాశివపేట వస్తుండగా ప్రమాదం జరిగింది. పటాన్చెరు సమీపంలోని రామేశ్వరం బండ బాహ్యవలయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతల వైపు కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన టిప్పర్ - ముగ్గురు యువకుల మృతి, మరో ముగ్గురికి గాయాలు
బైక్‌ను తప్పించబోయి కంటైనర్‌కు ఢీ కొట్టిన కారు- 9మంది దుర్మరణం