Road Accident in Chittoor District : ఏపీలోని చిత్తూరు జిల్లా మెగిలిఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు - బెంగళూరు ప్రధాన రహదారిపై బంగారుపాళ్యం మండలం మొగలి కనుమ రహదారిలో చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, పలమనేరు వైపు నుంచి వస్తున్న ఇనుప కమ్మీలతో కూడిన లారీ ఢీ కొన్నాయి. కనుమ రహదారిలో లారీ ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొన్న ఘటనలో ఆర్డీసీ బస్సు డ్రైవర్‌తో పాటు ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 30 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పలమనేరు ఆస్పత్రికి తరలించారు.
గాయాలపాలైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం చిత్తూరు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 7 మంది మరణించడం బాధాకరం అని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన చంద్రబాబు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
మొగిలిఘాట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలచి వేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రవాణాశాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పందించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి ఆరా తీశారు.