Minister Ponguleti Srinivas on Dharani Portal : ధరణి పోర్టల్‌ను సామాన్యులకు అందుబాటులో ఉండేలా, పునర్వ్యవస్థీకరించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలన్నీ కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ధరణిపై ఏర్పాటైన కమిటీ సూచించిందని మంత్రి పేర్కొన్నారు. భూవివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కూడా సిఫార్సు చేసిందన్నారు.
ధరణితో లక్షలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం : సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు ఎం.కోదండ రెడ్డి, ఎం.సునీల్ కుమార్, మధుసూదన్‌లతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలతో చిన్నాభిన్నం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారన్న ఆయన, వాటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసులపై సమావేశంలో చర్చించామని, కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి ఇచ్చే ముందే అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటాం : ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతీ గ్రామంలో సుమారు 200 కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. భూ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్‌ను పునర్‌వ్యవస్థీకరించి, చట్టాల్లో మార్పులు చేసేందుకు ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ధరణి కమిటీ నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాలలోని ఆర్ఓఆర్ యాక్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిందని మంత్రి తెలిపారు.
భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ ట్రైబ్యునల్‌లను ఏర్పాటు చేయాలని, భూమికి సంబంధించిన ముఖ్యమైన చట్టాలను కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని కమిటీ సూచించినట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం పార్ట్-బిలో ఉంచిన భూ సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.