Hydra Focus on Marri Rajashekar Reddy : నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపిన విషయం తెలసిందే. అక్రమ నిర్మాణాలపై ముందుగా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేసిన అనంతరం, హైడ్రా రంగంలోకి దిగుతోంది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.
హైకోర్టులో పిటిషన్ : చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను వారంలో తొలగించాలని గండిమైసమ్మ తహశీల్దార్, మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ నోటీసులను సవాల్ చేస్తూ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా సర్వే చేసి ఎఫ్‌టీఎల్ ఖరారు చేసి కూల్చివేతకు నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమని కాలేజీ యాజమాన్యాల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదించారు. అన్ని అనుమతులతోనే కాలేజీ నిర్మించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వారం రోజుల గడువు : చెరువులు సర్వే చేసి ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలని గతంలో ఓ పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించిందని అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రవికాంత్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో సర్వే చేసినప్పుడు ఈ ఆక్రమణలు బయటపడ్డాయని అందుకే వాటిని తొలగించాలని నోటీసులు ఇచ్చినట్లు ఆయన వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్, వారం రోజుల వరకు ఆ కాలేజీల భవనాలపై చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
అలాగే వారం రోజుల్లో తహశీల్దార్‌కు వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు. యాజమాన్యాల వివరణ కూడా పరిగణనలోకి తీసుకొని చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని తహశీల్దార్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్, నీలిమ విద్యా సంస్థలను ఎల్లుండి వరకు కూల్చవద్దని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. కొర్రెములలోని నల్ల చెరువు రికార్డులను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ఆక్రమణలతో హైదరాబాద్ అల్లకల్లోలం - హైడ్రా రాకతో ఆ అధికారుల్లో హడల్ - Land Encroachment in Telangana