Removal of Flexis With Implementation of Election Code: ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటికీ రహదారికి ఇరువైపులా వైసీపీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, ఇరుకు సందులు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయ పరిసరాలు, బడి, గుడి అని లెక్క చేయకుండా ఎక్కడపడితే అక్కడే ప్రచార ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు. ఎన్నికల రణరంగానికి మేము సిద్ధం మీరు సిద్ధమా అని అర్థం వచ్చేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన బ్యానర్లు పెట్టారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ ప్రచార పిచ్చికి కొన్ని ప్రాంతాల్లో తెరపడగా కొన్ని చోట్ల వాటిని అలాగే ఉంచారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ - ఫ్లెక్సీల తొలగింపు - నేతల విగ్రహాలకు ముసుగు
కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైసీపీ అభ్యర్థి వెంకట సతీష్ కమార్ పేరుతో సిద్ధమంటూ ఉన్న బ్యానర్లను అధికారులు అలాగే ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలకు ముసుగులు వేయగా మరికొన్ని ప్రాంతాల్లో నిధులు లేక అలాగే వదిలేశారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, హోర్డింగులను ఎప్పటికప్పుడు తొలగించిన నగర పాలక సంస్ధ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికార పార్టీకి చెందిన హోర్డింగులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఫ్లెక్సీలు నేతలు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా రద్దీగా ఉండే ఇరుకు రహదారుల మధ్యలోనూ భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. నాయకులు తమ అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిల్లో ప్రత్యేక బృందాలు, సచివాలయ సిబ్బంది కలిసి ఫ్లెక్సీల తొలగింపు పనులు చేపడుతున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అప్రమత్తమైన అధికారులు- ముమ్మరంగా ఫ్లెక్సీల తొలగింపు
ఏలూరులో ఎన్నికల కోడ్ను ఉల్లఘించి అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలు,హోర్డింగులు ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానికి చెందిన ఫ్లెక్సీలు కనిపిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నేతలు అమలుకు నోచుకోవడం లేదు. నగరంలో ఎటు చూసినా వైసీపీ నేతల ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో సిద్ధం పోస్టర్లు, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నానికి సంబంధించిన ఫ్లెక్సీలు కనిపిస్తూనే ఉన్నా నగర పాలక సంస్థ సిబ్బంది మాత్రం చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లను క్షణాల్లో తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఫ్లెక్సీల తొలగింపులో పక్షపాతమేమిటని ఇతర పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి ఒకలా ప్రతిపక్ష పార్టీలకు మరో విధంగా నిబంధనలుంటాయా అని వారు నిలదీస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారులు విస్మరించారు. నెగ్గిపూడిలోని అగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనంపై నవరత్నాలతో కూడిన లోగోలో బహిరంగంగా సీఎం చిత్రం దర్శనమిస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
ఎన్నికల కోడ్లో ఈ పనులు అస్సలు చేయకూడదు! ఉల్లంఘిస్తే కఠిన చర్యలు