Red Sandalwood and Wildlife Smuggling In Forests Of YSR District : ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం, అంతరించిపోతున్న జాబితాలో చేరిన వన్యప్రాణులకు రక్షణ కరవైంది. వైఎస్సార్ జిల్లాలోని లంకమల, పెనుశిల అభయారణ్యాల్లో అటవీ సంపదతోపాటు వన్యప్రాణుల స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. అంతరించిపోతున్న అనేక పక్షిజాతులు, వృక్షాలు, ఔషధ మొక్కలకు ఈ అభయారణ్యాలు నిలయాలుగా ఉన్నాయి. అత్యంత విలువైన అటవీ సంపదతో పాటు అరుదైన వన్యప్రాణాలపై స్మగ్లర్ల కన్నుపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ : ఇటీవల బద్వేల్ అటవీ శాఖ పరిధిలోని బోయినపల్లి బీట్లో అలుగుతో పాటు ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలిస్తున్న స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో కోట్లు విలువ ఉండటంతో స్మగ్లర్లు ఈ అభయారణ్యాలను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో అలుగు దాదాపు రూ.80 లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతుంది. చైనా, ఇతర దేశాలలో ఔషధ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగిస్తారు. అలాగే ఆభరణాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, వాలెట్ల తయారీకి కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు.
నల్లమలలో అలజడి - వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు
పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం : స్మగ్లర్లు అటవీ శాఖ అధికారుల కళ్లు కప్పి ఎర్రచందనంతో పాటు అంతరించిపోతున్న జాబితాలో ఉన్న వన్యప్రాణులను అక్రమ రవాణా చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఎంతగా కట్టడి చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం చెలరేగిపోతున్నారు. లంకమల, పెనుశిల అభయారణ్యాలలో ఇదే పరిస్థితి కొనసాగితే అంతరించిపోతున్న జాబితాలో చేరిన వన్యప్రాణులు, ఎర్రచందనం వృక్షాలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.
"అంతరించిపోతున్న వన్యప్రాణులను కాపాడేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తోంది. ఈ అలుగు చాల అరుదుగా లభించే జీవి. దీన్ని ఉదయగిరి అటవీ ప్రాంతం నుంచి అక్కడి గిరిజనులు వేటాడి పట్టుకున్నారు. అనంతరం రహస్య ప్రాంతంలో కొంత మంది గుమిగూడి అలుగును విక్రయించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశాం. అంతరించిపోతున్న జీవులను ఎవరైన వేటాడినా, అక్రమ రవాణా చేసినా కేసులు నమోదు చేస్తాం. అలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే పోలీసుల దృష్టికి తీసుకురండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడమేగాక తగిన పారితోషికం ఇస్తాం." - వెంకట శేషయ్య, డీఆర్వో బద్వేల్
ఒంటెలు అక్రమ రవాణా- అన్నమయ్య జిల్లాలో నిందితులు అరెస్ట్ - Camel Smuggling Gang Arrested