Reasons for Children Commit Crimes: ముగ్గురు మైనర్లు. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం. విషయం బయటపడుతుందని ఆ చిన్నారిని అంతమొందించారు. మృతదేహాన్ని ముళ్లపొదల్లో దాచారు. నిందితుల్లో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు. ఒకరు ఆరో తరగతి. పట్టుమని పదిహేనేళ్లైనా లేవు. అశ్లీల వీడియోలకి అలవాటుపడి దారుణానికి పాల్పడ్డారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి సమీపంలో జరిగిన ఈ ఘటన పిల్లలు ఏ విధంగా పెడదారి పడుతున్నారో తెలుపుతోంది.
కొంతమంది పిల్లల్లో నేరాలకు పాల్పడే ధోరణి విపరీతంగా పెరుగుతోంది. లైంగిక దాడులకు పాల్పడటం, మహిళలను కించపరచటం, వేధించటంతో పాటు భౌతిక దాడులు, హత్యలు వంటి విపరీత నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రమాదకర ధోరణి సమాజానికి ఛాలెంజ్‌గా మారుతోంది. విచక్షణ కొరవడి, తాము చేస్తున్న దుశ్చర్యలకు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటారో తెలియక నేరాల బాట పడుతున్నారు.
అసలు కారణాలు ఏంటి:
- అశ్లీల చిత్రాలు: లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి నేరాలకు పాల్పడ్డ బాలల్లో దాదాపు 95 శాతానికి పైగా అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటుపడ్డవారే ఉంటున్నారని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. సెల్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగడంతో కొందరు అశ్లీల వీడియోల వీక్షణకు ఆకర్షితులవుతున్నారు. క్రమంగా వాటికి బానిసవుతుండటం వలన అవి వారి మెదళ్లలో వికృత ఆలోచనల్ని నింపుతున్నాయి.
- గంజాయి, మాదకద్రవ్యాలు: హేయమైన నేరాలకు పాల్పడుతున్న పిల్లల్లో ఎక్కువ మంది మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు వంటి వాటికి బానిసలైనవారే ఉంటున్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ స్థాయీ సంఘం గతేడాది పార్లమెంట్‌కు సమర్పించిన రిపోర్టు ప్రకారం, ఏపీలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా, వారిలో 3.17 లక్షల మంది అంటే 15.70 శాతం బాలలే ఉన్నారు. బాలల నేరాలకు పాల్పడ్డ ఘటనలకు సంబంధించి 2020వ సంవత్సరంలో 759 కేసులు నమోదు కాగా, 2022 వచ్చే సరికి ఆ సంఖ్య 912కు పెరిగింది.
- పెరిగే వాతావరణం: కొందరు పిల్లల్లో ప్రవర్తనా లోపాలు, పెరిగిన వాతావరణం సరిగ్గా లేకపోవటం వంటివి సైతం వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాము కోరుకున్నది ఏదైనా దక్కాలనే మొండిపట్టుదల, వారిని నేరానికి పాల్పడేలా చేస్తున్నాయి.
- తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటం: తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం వలన పిల్లలు పక్కదారి పడుతున్నారు. అది క్రమంగా పెరిగి వారిని నేరాల వైపు మళ్లేలా చేస్తోంది. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలు దారి తప్పుతున్నారు అనేది పసిగట్టలేకపోతున్నారు. కొంత మంది తల్లిదండ్రులు వారి పిల్లలు ఏదైనా నేరం చేస్తే దానికి వత్తాసు పలుకుతున్నారు. పిల్లలకు స్వేచ్ఛ ఇస్తున్నాం అంటూ విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ధోరణే పిల్లల్ని చెడువైపు మళ్లిస్తోంది.
ఏం చూస్తున్నారో కనిపెడుతూ ఉండండి: పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో, వారి ప్రవర్తన ఎలా ఉంది అనేవి తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని మానసిక వైద్య నిపుణులు ఎన్.ఎన్.రాజు సూచిస్తున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏదైనా కొత్త ధోరణులు కనిపిస్తే వాటిని ముందే గుర్తించాలి. చెడు సావాసాలు, వ్యసనాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి.
మంచి, చెడుల గురించి చెప్తూ ఉండాలి. తప్పు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయో తెలపారు. నిరంతరం వారిని అప్రమత్తం చేస్తుండాలి. కుటుంబంలో మంచిగా పెరిగే వాతావరణాన్ని కల్పించాలి. సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు వంటి వాటికి అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ప్రతి రోజూ పిల్లలతో కొంత సమయాన్ని గడపాలి.