Ration Rice Missing From Godown in YSRCP Regime In Andhra Pradesh : వైఎస్సార్సీపీ హయాంలో పేదల నోటికాడ బియ్యాన్ని పెద్దలు గద్దల్లా తన్నుకుపోయారు. ప్రైవేటు గోదాముల్లోని వేల బస్తాల బియ్యాన్ని మాయం చేసేశారు. అత్యధిక గోదాములు వైఎస్సార్సీపీ నేతలవే కావడంతో వాటిలో నిల్వ ఉంచేందుకు పౌరసరఫరాల శాఖ ప్రాధాన్యమిచ్చింది. అక్కడి నుంచి లారీలకు లారీలు తరలించేసినా లెక్కా పత్రం లేదు. మొన్న మచిలీపట్నంలో, తాజాగా కాకినాడలో, తవ్వితే మరెన్ని చోట్ల అక్రమాలు బయటకొస్తాయో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఏటా 50 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకుని మిల్లర్లకు పంపారు.
ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల టన్నుల బియ్యాన్ని సీఎమ్మార్ కింద మిల్లర్లు పౌరసరఫరాల శాఖ గోదాములకు సరఫరా చేశారు. ఏ గోదాముకు ఎన్ని వెళ్లాయో? అక్కడ నుంచి మండల గోదాములకు ఎన్ని చేరాయో, ఇంకా అక్కడ ఎంత నిల్వలున్నాయో? ఐదేళ్లుగా సరైన లెక్కలే లేవు. గోదాము నిర్వాహకులు ఎంత చెబితే అంత రాసుకోవడమే పౌరసరఫరాల సంస్థ వంతు. వైఎస్సార్సీపీ నేతలకు చెందిన ప్రైవేటు గోదాముల్లో అయితే నిల్వ చేసిన బియ్యాన్ని ఏళ్ల తరబడి బయటకే తీయరు. అమ్ముకుని సొమ్ము చేసుకోండి మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి అనే ధోరణే. వ్యాపారులు, అధికారుల మధ్య అవగాహన ఆ స్థాయిలో ఉంది. అందుకే మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాములో 4 వేల 840 టన్నుల బియ్యం మాయమైంది. తాజాగా కాకినాడలోని గోదాములో 4 వేలకు పైగా బస్తాల లెక్క తేలట్లేదు. గతంలో అంబేడ్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా తిమ్మంచర్ల, బాపట్ల సమీపంలోని కర్లపాలెం, ఎన్టీఆర్ జిల్లా నిడమానూరుల్లో లారీల కొద్దీ బియ్యం మాయమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి తవ్వితే మరెన్నో ఉన్నాయి.
పౌరసరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది సహకారం లేకుండా ఇంత అడ్డగోలుగా జరగదు. వందలు, వేల టన్నులు మాయమైనా ఎవరికి వారే తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎక్కడెంత నిల్వలున్నాయో బయటకు తీసేందుకు ఆన్‌లైన్ విధానం తెచ్చినా అక్రమాల లెక్కలు తేలడం లేదు. అయినా ప్రైవేటు గోదాముల యజమానులు, అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది, అధికారులపై పౌరసరఫరాలశాఖ అలవిమాలిన ప్రేమ ఒలకబోస్తోంది.
ప్రభుత్వ గోదాముల నిర్వహణ సరిగా ఉండటం లేదు. వాటిలో నిల్వ చేసినందుకు కూడా బస్తాకు 5 రూపాయల చొప్పున ఇవ్వాలి. అదే ప్రైవేటు గోదాముల నిర్వాహకులైతే 75 పైసలు తక్కువకే ఇస్తారని, నిర్వహణ అంతా వారే చూసుకుంటారని సాకులు చెబుతూ పౌరసరఫరాల సంస్థ వాటికే ఎక్కువ బియ్యం తరలించింది. తక్కువ అద్దె తీసుకుని ఎన్ని వందలు, వేల టన్నుల బియ్యం తరలించి, అమ్ముకున్నా అభ్యంతరం లేదనేలా గత ఐదేళ్లూ వ్యవహరించింది.
రేషన్ బియ్యం కేసులో నానికి మరోసారి నోటీసులు ఇస్తాం - కృష్ణా జిల్లా ఎస్పీ
మొత్తం 104 బఫర్ గోదాముల్లో ఈ సంస్థ బియ్యం నిల్వ చేస్తోంది. ఇందులో వైఎస్సార్సీపీ నేతలవే అధికం. రైస్‌మిల్లర్ల ద్వారా వాటికి బియ్యం పంపడం వరకే పౌరసరఫరాలశాఖ పని. వాటిని తరలించినా అడిగేవారు ఉండరు. బస్తాకు 2 రూపాయల చొప్పున నజరానా ఇస్తారు కాబట్టి తనిఖీలు కూడా ఉండవు. అప్పుడప్పుడు నాణ్యత తనిఖీకి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వెళ్లినా చెప్పింది రాసుకుని రావడమే.
ప్రభుత్వ గోదాముల్లో అక్కడక్కడా నిల్వ చేసినా రెండు, మూడు నెలలకే బియ్యం తరలించేశారు. అదే ప్రైవేటు గోదాములైతే ఏడాదికి తక్కువ కాకుండా చూశారు. ఎంత ఎక్కువ కాలం నిల్వ ఉంచితే తమకు అంత ఎక్కువ కమిషన్ వస్తుందనేదే దీనికి కారణం. కొందరు ప్రైవేటు గోదాముల నిర్వాహకులు అద్దెలో రాయితీ ఇవ్వడమే కాకుండా మిగిలిన 3రూపాయల్లోనూ అధికారులు, సిబ్బందికి కమీషన్ల రూపంలో 2 రూపాయల వరకు అందిస్తున్నారు. అంటే దీనిపై వచ్చే అద్దె వారికి ముఖ్యం కాదు. బియ్యం అమ్ముకుంటే వచ్చే ఆదాయమే ఎక్కువనేది అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ గోదాముల సంస్థ, కేంద్ర గోదాముల సంస్థ, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో లక్షల టన్నుల గోదాములు ఖాళీగా ఉన్నాయి. భారత ఆహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం బస్తా నిల్వకు 5 రూపాయల చొప్పున అద్దెగా చెల్లించాలి. బస్తాకు 4 రూపాయలు ఇస్తే చాలు బియ్యం నిల్వ చేసుకోమని రాష్ట్ర గోదాముల సంస్థ అధికారులు కోరుతున్నా పౌరసరఫరాల సంస్థ అధికారులు నాలుగైదేళ్లుగా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రైవేటు ఒప్పందాలే చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయితే పేదల బియ్యానికి జవాబుదారీగా ఉంటుంది. సంస్థ సిబ్బందే నిర్వహణ బాధ్యత చూస్తారు. అదే ప్రైవేటు గోదాముల్లో నిర్వహణ అంతా వారు ఏర్పాటు చేసుకున్న సిబ్బందే చూస్తారు. బియ్యం మాయమైనా విషయం బయటికి రాదు.
రాష్ట్ర ప్రభుత్వ గోదాముల సంస్థకు చెందిన గోదాముల్లోనే బియ్యం నిల్వ చేయాలని గతంలో ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ప్రైవేటు గోదాములైనా సరే వారి ద్వారానే లీజుకు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. వైఎస్సార్సీపీ పాలనలో దానికి నీళ్లొదిలారు. పౌరసరఫరాల సంస్థ అధికారులే నేరుగా ప్రైవేటు గోదాముల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వాటిలోకే సీఎంఆర్ బియ్యం పంపి నిల్వ చేస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని మార్చి, ప్రభుత్వ గోదాముల్లో నిల్వకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఎలక్ట్రానిక్ చిప్‌తో కొత్త రేషన్ కార్డులు - ఇప్పటికే 4లక్షల దరఖాస్తులు