Perni Nani Ration Rice Case : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన జేఎస్ గోదాములో దాదాపు 7700 బస్తాల రేషన్ బియ్యం మాయమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డినే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని గోదాములో పీడీఎస్ బియ్యం మాయంపై ఇటీవలే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే బియ్యం నిల్వల మాయం విషయంలో తనపై అనుమానం రాకుండా కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆదివారం నాడు గోదాము మేనేజర్ మానస తేజ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రాంతంలో ఆయన్ను పోలీసులు వలపన్ని పట్టుకొని మచిలీపట్నం తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో పేర్ని నాని భార్యను మొదటి నిందితురాలిగా, గోదాముల మేనేజరు మానసతేజ్‌ని రెండో నిందితుడిగా పోలీసులు చేర్చారు. త్వరలోనే మానసతేజ్, కోటిరెడ్డి అరెస్ట్ చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఇద్దర్ని బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆరు నెలలుగా తనకు ఆరోగ్యం బాగోకపోవడంతో మేనేజర్‌గా మానసతేజ్‌ని నియమించామని జేఎస్ యజమాని అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
PDS Rice scam in AP : కానీ పోలీసులు విచారణలో రెండేళ్లుగా ఆయన మేనేజరుగా కొనసాగుతూ బిల్లులు రూపొందిస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అసలు బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు మానస్తేజ్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈకేసులోపేర్ని నాని భార్య పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు ఇవాళ విచారణకు రానుంది. మచిలీపట్నం జిల్లా కోర్టులో ఈ విచారణ జరగనుంది.
బ్లాక్ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్! - రేషన్ బియ్యం మచిలీపట్నం తరలింపు