Police Safety Lessons to Students : హెల్మెట్ ధరించమని ఎంతగా చెప్పినా చాలామంది ఇప్పటికీ పెడచెవిన పెడుతున్నారు. ఇలా కాదని అధికారులు రూటు మార్చారు. పిల్లల వైపు నుంచి వస్తే పెద్దల దారికి వస్తారని భావించారు. అందుకే పిల్లలకు రహదారి ప్రమాదాల నివారణపై పాఠాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు రోడ్డు నిబంధనలు పాటించేలా పిల్లలే చూడాలని సూచిస్తున్నారు. ఫలితంగా పిల్లలు 'తల్లిదండ్రులకు చెబుతాం ' అంటూ మాటిస్తున్నారు.
ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే : ఎన్టీఆర్ జిల్లాలో వాహనదారుల నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. జిల్లావ్యాప్తంగా రోజూ 30 మంది చొప్పున రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇందులో ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉంటున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు బలమైన గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణపై దృష్టిపెట్టిన పోలీసు, రవాణాశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా హెల్మెట్, సీటు బెల్టు వాడకాన్ని తప్పనిసరి చేశారు. భద్రతా నియమాలు పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని ఏకంగా జైలుకు పంపుతూ కటకటాలు లెక్కపెట్టిస్తున్నారు.
పిల్లలకు రహదారి భద్రతా పాఠాలు : అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటూనే ప్రమాదాల నివారణపై దృష్టిపెట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించేలా పలు రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. చిన్న పిల్లల ద్వారా పెద్దలకు సూచనలు చేయించాలని పోలీసులు, రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. చిన్న పిల్లలకు రహదారి భద్రతా పాఠాలు చెప్పడం ప్రారంభించారు. అధికారులతో కూడిన బృందం పాఠశాలలకు వెళ్లి పిల్లలతో సమావేశమవుతున్నారు. రహదారి ప్రమాదాలు జరుగుతోన్న తీరుని వివరిస్తున్నారు.
"ఇన్ని రోజులు రోడ్డుపై ప్రయానిస్తున్నామంటే మనం ఒక్కటే సేఫ్టీగా ఉంటే చాలనుకున్నాం. కానీ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాం. రోడ్డుపై ఎలా వెళ్లాలి. ఎలాంటి రూల్స్ పాటించాలనే అవగాహన వచ్చింది. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మా పేరెంట్స్ ఇలాంటి తప్పులు చేస్తే తప్పకుండా చెప్తాను." - సాయి లౌక్య, విద్యార్థిని
తల్లిదండ్రులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా కోరాలని పిల్లలకు అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పిన మాటలు తప్పక వింటారని ఆశిస్తూ పాఠశాలల్లో ఈ తరహా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.