Rare Incidents in Andhra Pradesh Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. తండ్రీ కుమారుడు, వియ్యంకులు, మామాఅల్లుడు ఇలా కొన్ని అరుదైన సంఘటనలు ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకులను ఒకేసారి అసెంబ్లీలో చూసి మురిసిపోతున్నారు. అవి ఏంటే ఇప్పుడు చూద్దాం.
ఒకే సభలో తండ్రీ కుమారుడు : తండ్రీ తనయులు ఒకే సభలో కొలువుదీరిన అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభలో చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా ఆయన కుమారుడు నారా లోకేశ్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రలోనూ ఇలాంటి అరుదైన సంఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి.
వియ్యంకుల హ్యాట్రిక్ : 2004 సార్వత్రిక ఎన్నికల్లో చిట్టెం నర్సిరెడ్డి, ఆయన కుమార్తె డీకే అరుణలు ఎమ్మెల్యేలుగా ఒకేసారి సభలో అడుగుపెట్టారు. నవ్యాంధ్రలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియలు ఎమ్మెల్యేలుగా సభలో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉండటంతో పాటు వియ్యంకులైన చంద్రబాబు, బాలకృష్ణలు వరుసగా మూడుసార్లు సభల్లో ఎమ్మెల్యేగా ఉంటూ హ్యాట్రిక్ సాధించారు.
మామా అల్లుడు : మామా అల్లుడు అయిన బాలకృష్ణ, నారా లోకేశ్‌లు ఒకే సారి శాసనసభ్యులుగా ఉన్న అరుదైన ఘటన ఈ సభలో చోటుచేసుకుంది. వియ్యంకులైన నారాయణ - గంటా శ్రీనివాసరావులు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఈ సభలో నిలవగా, వియ్యంకులే అయిన గంటా శ్రీనివాసరావు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు రెండోసారి ఎమ్మెల్యేలుగా ఒకే సభలో ఉన్నారు.
మరో వియ్యంకుల జంట అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తిలతో పాటు మామా అల్లుడు అయిన అచ్చెన్నాయుడు - ఆదిరెడ్డి వాసులు ఎమ్మెల్యేలుగా ఒకే సభలో కొలువుదీరడం విశేషం. ఇక సినీ రంగంలో అగ్రతారలుగా వెలుగుతున్న నందమూరి, కొణిదెల కుటుంబాల నుంచి బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు ఒకే శాసనసభలో కొలువుతీరడం అభిమానులకు పండగనే చెప్పాలి.