Irrigation Department ACB Case Update : నగర శివారు ప్రాంతాల్లోని చెరువులు, వాగుల్లో స్థిరాస్తి వెంచర్లు వేసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులు సహకరించారని దర్యాప్తు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ స్థిరాస్తి సంస్థలు, బడా బిల్డర్లకు కోట్లలో ప్రయోజనాలను చేకుర్చారని ఏసీబీ విచారణలో విస్తుపోయే విషయాలు తెరపైకి వచ్చాయి. ముడుపులిస్తే చెరువులో వెంచర్ వేసినా నిరభ్యంతర పత్రం ఇరిగేషన్ అధికారులు నుంచి వస్తుంది. మామూళ్లు ఇవ్వకపోతే బఫర్ జోన్‌కు వందమీటర్ల దూరం ఉన్నా ఎన్వోసీ రాదు. ఇలా ఐదారేళ్ల నుంచి ఇరిగేషన్ ఈఈ బన్సీలాల్ బృందం రంగారెడ్డి జిల్లా చెరువులు, వాగుల్లో ఆక్రమణలకు ఊతమిచ్చిందని ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఏసీబీ గుర్తించిన ఆక్రమణలు : గండిపేట్ మండలం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారికి సమీపంలో 34.20 ఎకరాలున్న పీఠం చెరువును క్రమంగా రియల్ ప్రతినిధులు ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమణల తెరవెనుక ఇరిగేషన్ అధికారులున్నారు. రూ.200కోట్ల విలువైన నాలుగు ఎకరాలను ఆక్రమించి లే అవుట్లు వేసి స్థలాలను ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ప్రస్తుతం ఈ ప్లాట్లలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. పీరంచెరువు గర్భంలో నిర్మించిన లేఅవుట్లలోని ప్లాట్లలో భవన నిర్మాణదారుల నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు లక్షల్లో ముడుపులు తీసుకుని నిరభ్యంతర పత్రాలు ఇచ్చారు.
ఇంతేకాదు. గండిపేట, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల నుంచి ఎన్వోసీలకు భారీగా మామూళ్లు తీసుకున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండు చెరువులను పూర్తిగా ఆక్రమించి విల్లాలు నిర్మించినా ఇరిగేషన్ ఈఈ బన్సీలాల్ ఏమాత్రం పట్టించుకోలేదు. శంషాబాద్ మండంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఒక వాగును ఆక్రమించి వెంచర్లు వేస్తే వాటికి నిరభ్యంతర పత్రాలిచ్చారు.
ACB Arrested Four Irrigation Employees : అలాగే మణికొండలోని నెక్నాంపూర్ చెరువుకు దూరంగా భవనం నిర్మించుకుంటున్న ఉపేందర్రెడ్డి కొద్దిరోజుల క్రితం నిరభ్యంతర పత్రం కోసం ఈఈ బన్సీలాల్‌ను కలిశారు. రూ.2.50లక్షలు ఇస్తే నిరభ్యంతర పత్రం ఇస్తామంటూ చెప్పారు. ఉపేందర్రెడ్డి ఇచ్చేందుకు ఇష్టపడకపోయినా ఆయన్ను వెంటాడి వేధించి మరీ లంచం సొమ్ము వసూలు చేసుకున్నారు. వీరికి భయపడిన ఉపేందర్రెడ్డి రూ.1.50లక్షలు ఇచ్చిన తర్వాత ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిరభ్యంతర పత్రం తయారవుతోందంటూ ఉపేందర్రెడ్డికి కొద్దిరోజుల క్రితం కార్తీక్ ఫోన్ చేశాడు. పుప్పాలగూడలోఉపేందర్రెడ్డి నివాసం వద్దకు కార్తీక్ వెళ్లి లక్ష రూపాయలు కావాలంటూ చెప్పడంతో ఆయన తీసుకోకుండా కారులో ఆ డబ్బును ఉంచాలని కార్తీక్ సూచించారు.
బఫర్ జోన్, ఎన్టీఎల్ పరిధిని గుర్తించేందుకు గండిపేట్ మండల సర్వేయర్ గణేష్ రూ.40వేలు డిమాండ్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్నా డబ్బులిస్తే వస్తా లేదంటే జూన్ 4 తర్వాత వస్తానంటూ ఆయన బెదిరించడంతో 25 రోజుల క్రితం లంచం సొమ్మును ఉపేందరెడ్డి రాజేంద్రనగర్‌కు వెళ్లి ముట్టజెప్పారు. ఏసీబీ అధికారుల సూచనలతో ఉపేందర్రెడ్డి రెడ్డిహిల్స్ ఈఈ కార్యాలయానికి గురువారం రాత్రి వచ్చి బన్సీలాల్, కార్తిక్, నిఖేష్లకు లంచం సొమ్ము ఇస్తుండగా ముగ్గురూ రెడ్ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్ గణేశ్ సెల్‌ఫోన్ స్విఛాప్ రావడంతో అతని కోసం ఏసీబీ అధికారులు మూడు గంటల పాటు శ్రమించారు. అనంతరం తన స్నేహితుడి ప్లాట్‌లో విందు పూర్తి చేసుకుని వస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వీళ్లు మారరు - ఏసీబీ వలకు చిక్కిన నలుగురు అవి 'నీటి' అధికారులు - ACB CAUGHT GOVT OFFICIALS RED HAND