Ramoji Rao Annadata Agriculture Programme : రైతేరాజు అందరూ మాటల్లో చెబుతారు. కానీ, ఆయన వారి కోసం ఏదైనా చేయడానికి ముందడుగు వేశారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆరుగాలం రైతన్న పడే కష్టం అంతా ఇంతా కాదు. ఆ అన్నదాతకు కొండంత అండగా ఉండాలని రామోజీరావు ఏనాడో సంకల్పించుకున్నారు. మాధ్యమం ఏదయినా రైతు సంక్షేమానికే అనుకున్నారు. ఇందుకు ఫలితమే 1969లో ప్రారంభించిన ‘అన్నదాత’ మాసపత్రిక. ఆ తర్వాత వచ్చినవే ఈనాడులోని ‘రైతేరాజు’, ఈటీవీలోని అన్నదాత కార్యక్రమం, ఈటీవీ-2లోని జైకిసాన్. ఇప్పటికీ ‘అన్నదాత’ కార్యక్రమం ఈటీవీలో నిరంతరాయంగా కొనసాగుతోంది.
“మనమంతా రైతు కుటుంబాలలో పుట్టి పెరిగాం. చదువుకొని ఒక స్థాయికి చేరాం. అయితే కష్టనష్టాలతో పంటలు పండిస్తున్న రైతాంగానికి నేనేం చేశాననే తపన నన్ను వేధిస్తోంది. వారికి సకాలంలో సలహాలు, సూచనలిచ్చే యంత్రాంగం లేదు. పంటల సాగుపై సరైన పరిజ్ఞానం లేదు. అందుచేత మన రైతాంగంలో ఆధునిక పరిజ్ఞానం పెంపొందించి, తోడ్పడాలనే ధ్యేయంతో 'అన్నదాత' అనే ఒక మాసపత్రికను ప్రారంభించబోతున్నాను" ఇవి రామోజీరావు సంపాదకవర్గంలో చేరబోతున్న కె.ఎస్. రెడ్డితో 1968 నవంబరులో అన్న మాటలు. 1969 జనవరిలో ఈ పత్రిక వెలువడింది.
అంకురార్పణ ఇలా : నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి సంక్రాంతినాడు ఈ పత్రికను ఆవిష్కరించారు. ఆ సభకు మంత్రి జె.వి.నరసింగరావు అధ్యక్షత వహించారు. ఆ సభలో రామోజీరావు మాట్లాడుతూ "మనది వ్యవసాయ దేశం. జనాభాలో 80 శాతం ప్రజలకు వ్యవ సాయమే జీవనోపాధి. మనకున్న వనరులను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మనం వెనుకబడి ఉన్నాం. వ్యవసాయ రంగంలో ప్రగతిని వారి భాషలో, వారి బాణీలో తెలియజెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి తోడ్పడాలనే సంకల్పంతో అన్నదాత పత్రికను ప్రారంభిస్తున్నాం’’ అన్నారు.
రైతాంగానికి ఉపయోగపడే వరి, నూనెగింజలు, పత్తి, పప్పు, చిరుధాన్యాలు తదితర పంటలపైన, పండ్లతోటలు, కూరగాయలు ఇతర ఉద్యానపంటలపైన, ఎరువులు, క్రిమిసంహారక మందులు, రుణాలు, బిందు, తుంపర్ల సేద్యం, పశుగణాభివృద్ధికి తోడ్పడే పాలు, పాలపదార్థాలు, డెయిరీ ఫారాలు, గొర్రెలు, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ, పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం, సాగునీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ మొదలైన అంశాలపై ప్రత్యేక సంచికలు ప్రచురించారు. రాష్ట్ర వ్యవసాయదారులు, పశుపోషకుల పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో 'అన్నదాత' సహకారం ఎంతో ఉంది. అన్నదాత వ్యవసాయదారుల సచిత్ర మాస పత్రిక వ్యవసాయదారుల్లో సన్న, చిన్నకారు రైతులు, కౌలుదార్లు అధికంగా ఉన్నారు. వారి సంఖ్య నానాటికీ పెరగడంతో అన్నదాతపై బాధ్యత కూడా మరింత పెరిగింది.
రైతేరాజుతో మెలకువలు : ఈనాడు దినపత్రిక 1974లో ప్రారంభించిన తరవాత, కొన్నేళ్లకు 'రైతేరాజు' అనే ప్రత్యేక కాలమ్ ప్రవేశపెట్టారు. ఆ రోజున లేదా ఆ వారంలో రైతులకు ఉపయోగపడే, లేదా రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న అప్పటి సమస్యలకు పరిష్కారాలు, పంటలసాగు, పాడి పశువులు, గొర్రెలు, మేకల పోషణలో మెలకువలు తెలియజేస్తున్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలోని రైతులకు సకాలంలో లభించవలసిన శాస్త్రీయ సమాచారం, సలహాలను అత్యంత ప్రజాదరణ గల ఈనాడు దినపత్రిక ద్వారా అందించాలనే ఆకాంక్షతో రూపుదిద్దుకున్నదే ఈ శీర్షిక.
రాష్ట్రంలోని పాడిపంటలు, అనుబంధ వృత్తులు, కార్యక్రమాలు, రైతుల స్థితిగతులలో ఉన్న వైవిధ్యానికనుగుణంగా ఆయా ప్రాంతాలకు సరైన సమయంలో అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించాలన్నదే సంకల్పం. దీనికి అనుగుణంగా ఆచరణ యోగ్యమైన సూచనలను అందించే ఈ కార్యక్రమం 2002 జూన్ 24న ఏరువాకతో మొదలైంది.
ఎలక్ట్రానిక్ మీడియాలోనూ : టీవీ కార్యక్రమాలు అన్నదాత మాసపత్రికతో అక్షర యజ్ఞం ప్రారంభించిన రామోజీరావు 1995లో ఈటీవీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలో అన్నదాత కార్యక్రమం ప్రసారాలను ప్రారంభించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయదారులకు పంటలసాగు గురించి ఈటీవీ ద్వారా సమస్త సమాచారాన్ని అందించడం ద్వారా అన్నదాత నిజంగా ఒక విప్లవమే తెచ్చింది. సాగుకు సంబంధించి అన్ని రకాల మెలకువల్ని ప్రత్యక్షంగా చూసి ఎందరో రైతులు సేద్యంలో పురోగమించారు. ఈటీవీ ప్రాంతీయ భాషా ఛానళ్ల ద్వారా అన్నదాత కార్యక్రమం దేశంలో ఎందరో రైతులకు మార్గదర్శిగా నిలిచింది.
ఇదే స్ఫూర్తితో ప్రారంభించిన మరో వ్యవసాయ కార్యక్రమం జైకిసాన్ రూపకల్పనా ఒక సంచలనమే. పంటల సాగుకు సంబంధించిన సలహాలు, సూచనలకు అన్నదాత కేంద్రమైతే, రైతు సమస్యలు, ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ సమస్యలు, వాటి పరిష్కారాలను సూచించడానికి జైకిసాన్ వేదికగా నిలిచింది. ఇప్పటికీ రైతన్నలకు కీలక సమాచారం ఇస్తూ ‘అన్నదాత’ కార్యక్రమం కొనసాగుతోంది.
ఎన్నో అవార్డులు : 1995 నుంచి అన్నదాత, 2003 నుంచి జైకిసాన్ కార్యక్రమాలు రైతుసేవలో పురోగమిస్తున్నాయి. రైతుల్ని జాగృతం చేస్తున్న కార్యక్రమాలుగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, దిల్లీ గుర్తించి అవార్డులు అందించింది. వరుసగా మూడేళ్లూ ఈ కార్యక్రమాలకే అవార్డులు దక్కడం ఈనాడుకు లభించిన గౌరవం. దేశంలో టీవీ మాధ్యమం ద్వారా రైతులకు చేస్తున్న కృషిపై పరిశోధించిన కొందరు ఈ రెండు కార్యక్రమాలే రైతులకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయని అంతర్జాతీయవేదికపై పరిశోధనాపత్రాలు సమర్పించడం ఈటీవీ కృషికి సరైన గుర్తింపు.
తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - RAMOJIRAO SERVICES TO MEDIA
మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు - ramoji rao success in MEDIA field