Ramachandrapuram CI Ashok Kumar Controversial Comments On Casts : ఆయన బాధ్యత గల పోలీస్ ఉన్నతాధికారి. కానీ ఆ బాధ్యతను మరచి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవాలని ప్రసంగం ఇచ్చారు. దీంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయనపై వేటు పడింది.
మంత్రి కుటుంబానికి రుణపడి ఉంటా : ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ కోనసీమ జిల్లా రామచంద్రపురం సీఐ కడియాల అశోక్ కుమార్ చేసిన ప్రసంగం చర్చనీయాంశం అయ్యింది. గురువారం ఓ సామాజిక వర్గం నిర్వహించిన వన సమారాధనకు సీఐ అశోక్ కుమార్ పోలీసు యూనిఫారంలో హాజరయ్యారు. ప్రముఖుల ప్రసంగాల అనంతరం అశోక్ కుమార్ ప్రసంగించారు. మనోళ్లు కాబట్టే ఎక్కడో ఉన్నవాడిని సొంత జిల్లాకు పోస్టింగ్ ఇప్పించుకున్నానని వెల్లడించారు. మంత్రి కుటుంబానికి తన కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటానని బహిరంగంగానే స్పష్టం చేశారు.
కులాన్ని ముందుకు తీసుకెళ్లాలి : మనల్ని మనం నిరూపించుకుంటే గోదారి జిల్లాల్లో మనదే పైచేయి అవుతుందని అశోక్ కుమార్ అన్నారు. ఇగోలతో పిల్లల భవిష్యత్తు పాడు చేయద్దని, రాజకీయం వేరు, కులం వేరని తెలిపారు. ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కులాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని సూచించారు. అగ్రకులాల్లో భార్య భర్తల మధ్య గొడవ జరిగితే వివాదం బయటకు రాకుండా ఫోన్లోనే పరిష్కరించుకుంటారని, అదే మన సామాజిక వర్గంలో ఊరంతా తెలుస్తుందని అన్నారు. ఇలాంటివి మానుకోని గోప్యత పాటించాలని సూచించారు.
వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు : అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన పోలీసు అధికారి రాజకీయ నాయకులతో వేదిక పంచుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పోలీసు యూనిఫారంలో ఉండి సీఐ అశోక్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు.
"మంత్రి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటాను. మనల్ని మనం నిరూపించుకుంటే గోదారి జిల్లాల్లో మనదే పైచేయి అవుతుంది. ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కులాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలి."- రామచంద్రపురం సీఐ కడియాల అశోక్ కుమార్
జగన్ సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం - వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు