Rajendra Nagar Police Station Best PS in India 2023 : ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ ఠాణాలకు ర్యాంకింగ్స్ ఇస్తోంది. అందులో భాగంగానే 2023 సంవత్సరానికి గానూ దేశంలోని 17 వేల పోలీస్ స్టేషన్లలో ఉత్తమంగా నిలిచిన 75 ఠాణాలను ఎంపిక చేసింది. పనితీరు, పరిసరాల పరిశుభ్రతతో పాటు పలు విభాగాల్లో పరిశీలించి అవార్డులు ప్రకటించగా, అందులో తెలంగాణలో 3 పోలీస్ స్టేషన్లు ఎంపికయ్యాయి. 2023కు గానూ దేశంలోనే అత్యుత్తమ ఠాణాగా సైబారాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్(Rajendra Nagar Police Station) నిలిచింది. జైపూర్‌లో జరిగిన అఖిలభారత డీజీపీ, ఐజీపీల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేతుల మీదుగా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ బి. నాగేంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు.
"మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో మేము ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయడం ఆ తర్వాత ఛార్జిషీట్స్ కూడా విత్ ఇన్ టైమ్‌లో ఫైల్ చేస్తాం. అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం కానీ, ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు నమోదు చేయడంలో ఎన్బీడీఎఫ్ ఎగ్జిబిషన్లో కానీ, సంఘ విద్రోహ శక్తుల పైన బైండోవర్ కేసులు నమోదు చేయడం ఇలా వీటన్నింటిని పారామీటర్‌గా తీసుకొని కేంద్ర హోం శాఖ రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్‌ను దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేయడం జరిగింది." - నాగేంద్రబాబు, రాజేంద్రనగర్ ఇన్పెక్టర్
Best Police Station in India 2023 : వివిధ అంశాల్లో మంచి పనితీరు కనబరిచినందుకు ప్రతీ రాష్ట్రం నుంచి కేంద్ర హోంశాఖ 3 పోలీస్స్టేషన్లను ఎంపిక చేసింది. ఆయా ఠాణాలకు ప్రతినిధి బృందాలను పంపి వారి పనితనంపై సర్వే కూడా నిర్వహించి మార్కులు కేటాయించారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, రాచకొండ పరిధిలోని మేడిపల్లి, హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పీఎస్‌లను ఎంపిక చేశారు. ఈ నివేదికలను పరిశీలించిన కేంద్ర హోంశాఖ రాజేంద్రనగర్ ఠాణాను దేశంలోనే అత్యుత్తుమ ఠాణా(India Best PS)గా ప్రకటించింది. స్టేషన్ సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ రవిగుప్తా, ఉన్నతాధికారులు అభినందించారు.
సబ్ ఇన్స్పెక్టర్గా ఏడేళ్ల బాలుడు - కలను సాకారం చేసుకున్న క్యాన్సర్ పేషెంట్
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే 2023లో ఇక్కడ మొత్తం 1232 కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్ స్టేషన్లో ముగ్గురు ఇన్పెక్టర్లు, 11 మంది ఎస్సైలు, 7గురు ఏఎస్ఐలు, 70 మంది కానిస్టేబుళ్లు, 4గురు హెడ్ కానిస్టేబుళ్లు, 29 మంది హోంగార్డులు, ఒక ప్రత్యేక పోలీసు అధికారి ఉన్నారు. ఫిర్యాదుదారు పట్ల వీరంతా సానుకూలంగా స్పందించడం, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేసినందుకుగానూ ఈ అవార్డు లభించినట్లు స్టేషన్ అధికారులు చెబుతున్నారు.
ఫలితాలిస్తున్న రిసెప్షన్ వ్యవస్థ : తెలంగాణ పోలీసు శాఖ ప్రవేశపెట్టిన రిసెప్షన్ వ్యవస్థ ప్రతి ఠాణాలో మంచి ఫలితాలను ఇస్తోంది. ఫిర్యాదు చేసేందురు ఆందోళనతో వచ్చే వారితో మాట్లాడి వారిని ప్రశాంతంగా ఫిర్యాదు చేసే వీలు కల్పించే విధంగా ఈ వ్యవస్థ దోహదపడుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కానిస్టేబుల్ పనితీరును ఉన్నతాధికారులు సైతం ప్రశంసిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించడం, ఫిర్యాదును రాయలేని వారికి సహాయం చేయడం తదితర అంశాలతో బాధితులకు అండగా ఉంటున్నారు.
Rajendra Nagar PS in Hyderabad : వేగంగా ఫిర్యాదును నమోదు చేసి కేసు తీవ్రతను గమనించి ఆయా పరిధిలోని ఎస్సైలకు ఆ బాధ్యతను అప్పగిస్తున్నారు. దీంతో ఫిర్యాదుపై వెంటనే స్పందించి విచారణ ప్రక్రియ సులభతరం అవుతోంది. కేసులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారని ఫిర్యాదుదారులు సైతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌ను ప్రశంసిస్తున్నారు. ఉన్నతాధికారులు సహకారంతోనే ఉత్తమ పనితీరు అందిచామని పోలీస్ స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాలకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఆదర్శంగా తీసుకుని పని చేయాలని పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మిగతా ఠాణాలు కూడా ఇదే విధంగా ఆదర్శంగా నిలవాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పనితీరులో రాజేంద్రనగర్ పీఎస్ బాద్షా- అమిత్‌షా చేతులమీదుగా ట్రోఫీ ప్రధానం
హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం - పంజాగుట్ట పీఎస్‌లో సిబ్బంది మొత్తం బదిలీ